మోడీ గారూ జోక్యం చేసుకోండి... జగన్ లేఖ
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు శ్రీవారి లడ్డూ చుట్టూ సాగుతున్న ఆరోపణలు వీటన్నింటి నేపథ్యంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
By: Tupaki Desk | 22 Sep 2024 12:34 PM GMTఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు శ్రీవారి లడ్డూ చుట్టూ సాగుతున్న ఆరోపణలు వీటన్నింటి నేపథ్యంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వైసీపీని అన్ని పార్టీలు వేలెత్తి చూపిస్తున్నాయి. బదనాం చేస్తున్నాయి. దీంతో వైసీపీ అధినాయకత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆశ్రయించింది
ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఒక లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. శ్రీవారి లడ్డూ పేరుతో ఆలయ ప్రతిష్టకే భంగం కలిగించే చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
దశాబ్దాలుగా సాగుతున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ గురించి ఆయన వివరించారు. దాని పద్ధతుల గురించి కూడా లేఖలో జగన్ స్పష్టం చేశారు. అతి తక్కువ కోట్ చేసిన వారి నుంచే నెయ్యిని సేకరిస్తారని కూడా పేర్కొన్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం అయినా లేక వైసీపీ అయినా ఇదే తీరుగా సాగుతుంది అని కూడా అన్నారు.
ఇక కల్తీ నెయ్యి అన్నది కనుక ఉంటే దానికి ఆలయం లోపలికి రానీయరని, మూడు విడతల టెస్టింగులోనే అది తేలుతుందని కూడా చెప్పారు. ఇలా విషయం అంతా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కల్తీ నెయ్యితో స్వామి వారికి నైవేద్యం పెడుతున్నారని చెబుతూ తీవ్ర విమర్శలు చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని అన్నారు.
తిరుమల తిరుపతి శ్రీవారి ప్రతిష్టను దెబ్బ తీసే చర్యగా దీనిని జగన్ అభివర్ణించారు. చంద్రబాబు అబద్ధాన్ని చెబుతూ జనాలను మభ్యపెడుతున్నారని కూడా ఆయన లేఖలో ఆరోపైంచారు. ఈ నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చి మనోభావాలు గాయపడిన కోట్లాది మందికి స్వాంతన కలుగచేయాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు.
ఈ విషయంలో మోడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం ఎలా తయారు అవుతుందో దానికి ఉండే నిబంధనలు ఎలాంటివో కూడా జగన్ ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ విధంగా చేస్తోందని ఆయన విమర్శించారు. సున్నితమైన అంశాల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా ఆలోచించకుండా టీడీపీ శ్రీవారి ఆలయ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేలా రాజకీయం చేస్తోందని జగన్ అన్నారు. అంతే కాదు టీటీడీ శతాబ్దాలుగా అనుసరించే సంప్రదాయాల మీద కూడా అనుమానాలు పెరిగేలా చేస్తోందని అన్నారు.
అందువల్ల ప్రధాని జోక్యం చేసుకుని దీని మీద వాస్తవాలు జనాలకు చెప్పాలని అన్నారు. మరి మోడీకి జగన్ రాసిన లేఖలో ప్రధాని చొరవ తీసుకోవడం అంటే సీబీఐ విచారణ కోరుతున్నట్లుగానే భావించాలి. కేంద్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఉంది. ఏపీలోనూ అదే కూటమి ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ విపక్ష నేత రాసిన ఈ లేఖను ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ఆలోచించి చర్యలు తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. ఒక వేళ ఈ లేఖను కేంద్రం సీరియస్ గా పరిగణించినట్లు అయితే విచారణకు కేంద్ర ఏజెన్సీలను ఆదేశిస్తారా అన్నది కూడా చూడాలి.