ఆ రెండూ కాదు జగన్...వైసీపీలో కొత్త చర్చ
ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 10 Dec 2024 11:30 AM GMTతాను ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అతి మంచితనం, అతి నిజాయతీ ప్రధాన కారణాలు అంటూ ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అయితే దానిని విన్న వారు రకరకాలైన కామెంట్స్ సోషల్ మీడియాలో చేశారు.
వాటి సంగతి పక్కన పెడితే జగన్ పార్టీ అధినేతగా తీసుకునే నిర్ణయాలే వైసీపీ కొంప ముంచుతున్నాయని అంతా అంటున్నరు. దీని మీదనే పార్టీలో చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఏకంగా 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చేయడం.
అలా ఎన్నికలకు కొద్ది నెలల వ్యవధి మాత్రమే ఉండగా కొత్త వారిని అక్కడికి షిఫ్త్ చేయడం పాత వారికి బదిలీలు పేరిట ఎక్కడో దూరంగా విసిరి కొట్టడం వంటివే వైసీపీ దారుణ పరాజయానికి కారణాలు అని అంటున్నారు. వీటి మీద జగన్ పూర్తిగా ఎపుడైనా అధ్యయనం చేశారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
మరో వైపు ఏంటి అంటే జగన్ ఒక ప్రభుత్వ అధినేతగా పార్టీ అధినాయకుడిగా ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరిని అందలం ఎక్కించాలి అన్నపుడు ఆయన ఎంచుకున్న కొలమానాలు ఏంటి, తీసుకున్న లెక్కలేంటి అన్నది కూడా అపుడూ ఇపుడూ ఎపుడూ చర్చగానే ఉంది. జగన్ ఏరి కోరి అందలాలు ఎక్కించిన వారు వైసీపీ ఓటమి పాలు కాగానే ఫిరాయించి మరీ బయటకు పోతున్నారు.
అంతే కాదు సామాజిక న్యాయం అంటూ బలమైన ఒక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి చేసిన ప్రయోగాలకే ఆయన 2024 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించారు అని అంటున్నారు. ఇక బంధుప్రీతి అని ఆయన ఎక్కడ జడిసారో ఏమో కానీ షర్మిలకు చోటు లేకుండా చేశారు. ఇపుడు కూటమి ప్రభుత్వంలో చూసినా నిన్నటి బీఆర్ఎస్ లో చూసిన తన సొంత కుటుంబీకులకు పదవులు ఇచ్చుకున్నారు.
లేటెస్ట్ గా ప్రియాంకా గాంధీని ఎంపీగా చేశారు రాహుల్ గాంధీ. మరి ఇవన్నీ చూస్తూంటే జగన్ మొండిగా షర్మిల విషయంలో వ్యవహరించారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటే ఆమె జగనన్న బాణంగానే ఉండేవారని అది పార్టీకి ఎంతో బలంగా ఉండేది అన్న వాదన కూడా ఇపుడు వినవస్తొంది.
జనాలు ఏదో అనుకుంటారని భావిస్తూ జగన్ భ్రమలలో తాను ఉంటూ అదే నిజమనుకుంటూ చేసిన రాజకీయాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ రాంగ్ అయ్యాయని చివరికి బూమరాంగ్ అయ్యాయని అంటున్నారు. సమర్ధులకు పట్టం కడితే వారే పార్టీకి బలంగా నిలబడతారు.
అలా కాకుండా ఏవేవో లెక్కలేసుకుని చాలా మంది కొత్త వారిని అనూహ్యంగా తెర మీదకు తెచ్చి వైసీపీ అధినాయకత్వం చేసిన రాజకీయ విన్యాసం మూలంగానే ఈ పరిస్థితి అని అంటున్నారు. జగన్ అధినేతగా సరైన జడ్జిమెంట్ తో నిర్ణయాలు తీసుకోలేకపోయారు అని కూడా అంటున్నారు.
చంద్రబాబు మీద ఒక విమర్శ ఉంది. ఏ నిర్ణయం అయినా ఆయన నానుస్తారు అని. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం కరెక్ట్ గానే ఉంటాయని ట్రాక్ రికార్డు నిరూపిస్తోంది. మిగిలిన ఇరవై శాతం కాలం కలసిరాక సమీకరణలు మారడం వల్ల తప్పు అయి ఉండవచ్చు అంటున్నారు.
మరి జగన్ స్పీడ్ గా డెసిషన్స్ తీసుకుంటారు అని పేరు. డెసిషన్స్ విషయంలో చంద్రబాబు అందరితో సంప్రదించినా చివరిని తన మనసులో ఉన్నదే తీసుకుంటారు అని అంటారు. జగన్ అయితే తాను అనుకున్నది చేస్తారని అలా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏకపక్షం అన్న విమర్శలకు అలా అపవాదు వచ్చేలా చేసుకుంటున్నారని అంటారు.
ఇక ఇప్పటికైనా మించిపొయినది లేదని జగన్ తన పన్నెండేళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు మాత్రం కరెక్ట్ గానే ఉండాలని అంతా కోరుకుంటున్నారు. అనర్హులకు అందలాలు ఎక్కించడం వల్ల పార్టీకి జగన్ కి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది అన్నది గుర్తించి మరీ ఆయన వీటి మీద ఫోకస్ పెట్టాలని అంటున్నారు. అంతే తప్ప అతి మంచితనం అతి నిజాయతీ అంటూ జగన్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పరిగణనలోకి తీసుకోకపోతే ఇబ్బందే అంటున్నారు.