విను నా మాట ...గతం లోతుల్లో నుంచి జగన్ !
అయితే జగన్ లోని ధైర్యం అందరికీ వస్తుందా అందరూ జగన్ లా ఆలోచించగలరా అన్నదే ప్రశ్న. మొత్తానికి క్యాడర్ లో ధైర్యం నింపడానికి జగన్ తననే ఉదాహరణగా చూపిస్తున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2024 2:30 AM GMTజగన్ గతాన్ని గౌరవిస్తారు కానీ చింతించరు అని అంటారు దగ్గర నుంచి చూసిన వారు. అయితే అన్నీ గుర్తు ఉంచుకుంటారు. తాను బాధ పడినా సందర్భాలు ఉన్నా ఆయన బయటకు వ్యక్తం చేసినది బహు తక్కువ. ఏదైనా తీసుకుందామనుకునే ధోరణి ఆయనది.
ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన ఎక్కువ దూరం ఆలోచించి డెసిషన్లు తీసుకోరు. ఒక డెసిషన్ తీసుకున్నపుడు అందులో తనదైన ఆలోచనలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని మాత్రమే చూస్తారు. ఆ తరువాత ఆ డెసిషన్ పరంగా వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఆయన తీసుకుంటారు. ఇది ఒక విధంగా అరుదైన విషయంగానే చూడాలి.
పైగా రాజకీయాల్లో ఉన్న వారికి దీని వల్ల ఇబ్బంది ఎక్కువ అని కూడా అంటారు. కానీ జగన్ మాత్రం ఇదే విధంగా అనుసరిస్తూ సాగుతున్నారు. ఈ ప్రస్థానంలో ఆయనకు రెండు పరాజయాలు ఒక విజయం దక్కాయి. ఒకసారి గౌరవనీయమైన పరాజయం ఒక అధ్బుతమైన విజయం దక్కితే ఈసారి ఘోరమైన పరాజయం లభించింది.
దాంతో ఆయన ఒకసారి గతంలోకి తొంగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందా అన్నదే చర్చగా ఉంది. ఇక జగన్ తననే చూడమంటూ పార్టీ లీడర్లకు పదే పదే ఉద్భోదిస్తున్నారు. ఆ సందర్భంగానే గతాన్ని ముందుకు తెస్తున్నారు. నాకు జరిగిన సంఘటనకు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కూడా ఎవరికీ లేవని కూడా ఆయన అంటున్నారు.
దాంతోనే ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూ ప్రపంచంలో నేను పడ్డ బాధలు ఎవరూ పడలేదు అని ఏపీకి సీఎం గా పనిచేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఆయన కడప జిల్లలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కడప కార్పోరేషన్ లో తమ పార్టీకి చెందిన కార్పోరేటర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను తీసుకుని వెళ్ళి ఏకంగా 16 నెలల పాటు జైలులో పెట్టారని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాడు తనకు బెయిల్ తెప్పించడం కోసం తన భార్య భారతి ఎంతో శ్రమపడ్డారని జగన్ చెప్పారు. కష్టాలు ఎల్ల కాలం ఉండిపోవని ఆయన అన్నారు.
ఈ రోజు ఇబ్బంది కావచ్చు భవిష్యత్తు బాగుంటుందని తాను మళ్లీ సీఎం అవుతాను అని వారితో చెప్పారు. తాను సీఎం అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లో సీఎం అయినట్లే అని ఆయన కొత్త స్లోగన్ వినిపించారు. పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిత్వాన్ని అమ్ముకోవద్దంటూ హితబోధ చేశారు.
ఇక టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా జగన్ సంచలన వ్యాక్యలు చెశారు. బాబులో నానాటికీ భయం పెరిగిపోతోంది అని అన్నారు. 2027లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికలు అనేసరికి బాబుకు భయం పట్టుకుంటోందని సెటైర్లు వేశారు.
ఎపుడు ఎన్నికలు వచ్చినా గెలిచేసి వైసీపీ మాత్రమే అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. మోసపూరితమైన హామీలతోనే బాబు అధికారంలోకి వచ్చారని జగన్ విమర్శించారు. మేనిఫేస్టోని చెత్తబుట్టలో వేశారు అని ఆయన ఆరోపించారు.
మొత్తం మీద చూస్తే జగన్ ఈసారి అధికారం మనకు పక్కా అని చెబుతూనే తాను పడిన కష్టాలను చూసి ధర్యంగా ఉండాలని తాను ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటాను అని అంటున్నారు. అయితే జగన్ లోని ధైర్యం అందరికీ వస్తుందా అందరూ జగన్ లా ఆలోచించగలరా అన్నదే ప్రశ్న. మొత్తానికి క్యాడర్ లో ధైర్యం నింపడానికి జగన్ తననే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ నేపధ్యమో తాను పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు అని ఆయన చేస్తున్న కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.