ఎమ్మెల్యేగా జగన్ జీతం తీసుకోవడం లేదా ?
ఈ విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యత ఉందని సభకు రావాలని అన్నారు.
By: Tupaki Desk | 21 March 2025 4:13 PM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యే. దాంతో ఆయనకు ఎమ్మెల్యేగా ప్రతీ నెలా జీతం కింద లక్షా పాతిక వేల రూపాయలతో పాటు అనేక అలవెన్సులు రూపంలో కూడా వస్తుంది. అయితే జగన్ ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదుట. ఆ విషయం ఎవరో చెప్పడం లేదు. ఏకంగా శాసన సభాపతి హోదాలో అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం మీద సభలో చర్చ సాగింది. సభకు రాకుండా జీతాలు తీసుకోని ఎమ్మెల్యేల విషయం చర్చించేందుకు ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు
ఈ విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యత ఉందని సభకు రావాలని అన్నారు. ప్రభుత్వం తరఫున జీతాలు తీసుకుంటున్న వారు సభకు ఎందుకు రారు అని ఆయన అన్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అంతా జీతాలు తీసుకుంటున్నారని ఒక్క జగన్ తప్ప అని ఆయన స్పష్టత ఇచ్చారు.
దీంతో ఈ విషయం ఇపుడు సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. జగన్ ఏ రోజూ ఎమ్మెల్యేగా కానీ సీఎం గా కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకోలేదని వైసీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. జగన్ సీఎం అయ్యాక ఒక్క రూపాయినే తన జీతంగా అప్పట్లో ప్రకటించారు. నిజానికి సీఎం కి మూడున్నర లక్షల నెల జీతంతో పాటు అనేక అలవెన్సులు ఉంటాయన్నది తెలిసిందే. కానీ జగన్ అయిదేళ్ళ కాలంలో వాటిని తీసుకోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక విపక్షంలోకి వచ్చాక పది నెలల కాలంలో జగన్ ఎమ్మెల్యేగా కూడా జీతం తీసుకోవడం లేదని అంటున్నారు. స్పీకర్ స్వయంగా ఆ విషయం ప్రకటించడంతో వైసీపీలో ఒక్క జగన్ తప్ప మిగిలిన పది మంది జీతాలు పుచ్చుకుంటున్నారు అన్నది కూడా తేటతెల్లమైంది.
ఇక జీతాలు పుచ్చుకుని సభకు రాకుండా పోతే ఎలా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఇదే విషయం తెలంగాణాలోనూ చర్చకు వస్తోంది. గడచిన పదిహేను నెలల కాలంలో లీడర్ ఆఫ్ అపొజిషన్ కింద కేసీఆర్ కి తెలంగాణా ప్రభుత్వం ఏకంగా 57 లక్షల రూపాయలను చెల్లించింది అని అక్కడ అధికార కాంగ్రెస్ నేతలు చెబుతూ జీతం పుచ్చుకుని కేసీఆర్ సభకు ఎలా గైర్ హాజరు అవుతారని నిలదీస్తున్నారు. కేసీఆర్ గైర్ హాజరు మీద కోర్టులో పిల్ కూడా దాఖలు అయింది.
ఇక ఏపీలో చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అరవై రోజుల పాటు సభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అవుతుందని రూల్స్ ప్రకటించాక ఎమ్మెల్యేలు వచ్చి రిజిష్టర్ లో సంతకాలు చేసి వెళ్తున్నారని అధికార కూటమి నేతలు అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా సభకు రప్పించాలని సభ్యత్వం రద్దు అన్న రూల్ చెబితే దానికి కూడా వారు వేరే విధంగా మార్గం ఎంచుకున్నారని అంటున్నారు. ఇపుడు వారి జీతాల విషయం ప్రస్తావనకు వస్తోంది. జీతాలు పుచ్చుకుంటూ సభకు గైర్ హాజరు అవడమేంటి అన్నది కూటమి నేతలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అయితే ఈ విషయంలో కూడా జగన్ జీతమే అసలు పుచ్చుకోవడం లేదని తెలియడంతో అది సోషల్ మీడియాలో వేరే రకమైన డిస్కషన్ కి దారి తీస్తోంది.
అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి చివరి రెండున్నరేళ్ళ పాటు గైర్ హాజరు అయ్యారు కదా మరి ఆయన జీతం పుచ్చుకోలేదా అపుడు సంగతేంటి అని వైసీపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఆనాడు సభకు ఎందుకు హాజరు కాలేదని బాబుని ఎవరైనా అడిగారా అని వారు నిలదీస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్ అక్కడా సభకు వెళ్ళకపోవడంతో జీతాల ప్రస్తావన వస్తోంది. ప్రజల సొమ్ము తీసుకుంటూ సభకు రాకపోతే ఏమి చేయాలన్న దాని మీద కొత్త రూలింగ్ ఏమైనా ఇస్తారేమో చూడాల్సి ఉంది. ఇంత వివాదంలోనూ జగన్ జీతమే తీసుకోవడం లేదన్నదే హైలెట్ అవుతోంది మరి.