అదానీ - జగన్ ఫైట్.. ఇక, ఎండింగే...!
అందుకే.. వారు `అఫిషియల్`గా పేర్కొన్నారన్నది టీడీపీ నాయకులు చేస్తున్న వాదన. అఫిషియల్ అంటే.. అప్పటి సీఎం జగనేనని వాదిస్తున్నారు.
By: Tupaki Desk | 30 Nov 2024 6:31 AM GMTప్రముఖ పారిశ్రామిక వేత్త.. ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ ఏపీలో సౌర విద్యుత్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందంలో అప్పటి సీఎం జగన్‌కు 1750 కోట్ల రూపాయల మేరకు లంచాలు ఇచ్చారన్నది అంత ర్జాతీయంగా వచ్చిన అభియోగం. అయితే.. దీనిపై రాజకీయంగా అధికార కూటమిలోని టీడీపీకి, వైసీపీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలు నా పేరు ఎక్కడ ఉందన్నది అప్పటి సీఎం వైసీపీ అధినేత జగన్ సంధిస్తున్న ప్రశ్న.
ఎందుకంటే.. అమెరికాలో నమోదైన కేసులో.. ``ఆంధ్రప్రదేశ్ అఫిషియల్`` అని పేర్కొన్నారు. వాస్తవానికి మన ఇండియన్ లాంగ్వేజ్‌లో అఫిషియల్ అంటే.. ప్రభుత్వ అధికారి అని అర్థం. కానీ, అమెరికా భాషలో చెప్పాలంటే.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకులు కూడా అధికారులుగా పరిగణిస్తారు. అందుకే.. వారు `అఫిషియల్`గా పేర్కొన్నారన్నది టీడీపీ నాయకులు చేస్తున్న వాదన. అఫిషియల్ అంటే.. అప్పటి సీఎం జగనేనని వాదిస్తున్నారు.
ఇక, ఈ విషయంలో తాను ఎందుకైనా సిద్ధమేనన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు. కానీ, ఈ విషయంలో టీడీపీ దాడి కేవలం వన్ సైడ్‌గానే కనిపిస్తోంది. అదానీ ఇచ్చిన లంచం.. జగన్ తీసుకున్నారన్నది వాస్తవమైతే.. ఈ కేసులో అదానీ పాత్ర కీలకం. ఉదాహరణకు మన భారతీయ చట్టాల్లో కూడా తీసుకున్నవారే కాదు.. లంచం ఇచ్చిన వారిపైనా సేమ్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు. కాబట్టి అదానీ కూడా ఈ కేసులో భాగంగానే చూడాలి. కానీ, టీడీపీ ఈ విషయాన్ని నేరుగా చెప్పదు.
కేంద్రంలోని పెద్దలతో అదానీకి ఉన్న సంబంధాలు..రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో టీడీపీ కానీ,మిత్రపక్షాలు కానీ.. ఎక్కడా జగన్ పేరును తీసుకువస్తున్నాయే తప్ప.. దీనిపై అదానీ గురించి ఎక్కడా మాట్లాడక పోవడం గమనార్హం. మరోవైపు.. అదానీ-జగన్ విషయాన్ని నేరుగా కెలికితే.. రేపు పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో జగన్‌పై ఫైట్ చేసినా.. కూటమికి వొనగూరే ప్రయోజనం లేదు. అందుకే.. పార్టీ అంతర్గత నిర్ణయాల్లో ఈ విషయాన్ని తగ్గించాలని సూచించడం గమనార్హం. దీంతో ఇక నుంచి ఈ విషయం దాదాపు తెరమరుగేనని అంటున్నారు పరిశీలకులు.