పెరిగిన పొలిటికల్ హీట్...ఇక తప్పదా ?
ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా 2024 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం 164 సీట్లను కైవశం చేసుకుని కూటమి ప్రభుత్వం జెండా ఎగరేసింది.
By: Tupaki Desk | 18 Feb 2025 6:30 PM GMTఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా 2024 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం 164 సీట్లను కైవశం చేసుకుని కూటమి ప్రభుత్వం జెండా ఎగరేసింది. వైసీపీ పూర్తి స్థాయిలో డీలా పడిపోయింది. గడచిన తొమ్మిది నెలలుగా చూస్తే వైసీపీలో చడీ చప్పుడు లేకుండా ఉంది.
వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్న వైనం కూడా ఉంది. అంతే కాదు జగన్ సైతం ఎక్కువగా బెంగళూరు లో గడుపుతున్నారు అన్న చర్చ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో జగన్ గేర్ మార్చినట్లు గా కనిపిస్తోంది. ఆయన లండన్ ట్రిప్ నుంచి వచ్చిన తరువాత క్యాడర్ తో మాట్లాడుతూ 2.0 అన్నారు. ఆ మీదట చేరికల మీద ఫోకస్ పెట్టారు.
ఇపుడు చూస్తే ఆయన వరస పర్యటనలు చేపడుతున్నారు. నిన్న విజయవాడ నేడు గుంటూరు ఇలా జగన్ టూర్లు సాగాయి. ఇకపోతే జగన్ వెళ్ళిన చోటల్లా జనాలు బాగానే వస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఉత్సాహంగా కనిపించారు. జగన్ సైతం ఫుల్ ఫోకస్ తో కూటమి ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
ఆయన గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఇక సమరమే అని కూడా స్పష్టం చేశారు. కూటమి సర్కార్ తో రాజకీయ యుద్ధానికి సిద్ధమని కూదా ఆయన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు.
ఇక విజయవాడలోనూ గుంటూరులోనూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కనుక మళ్లీ వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుందన్న సందేశాన్ని అటు పార్టీలో ఇటు జనంలోనూ పంపించారు. అదే విధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే రకమైన సిగ్నల్ ఇచ్చారు. మేము మళ్ళీ వస్తామని అపుడు ఇదే లెక్క అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది.
గుంటూరు పర్యటనలో జగన్ కి కనీస భద్రత కల్పించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. కానీ అది ఎక్కడా అమలు కాలేదు. దాంతో జగన్ వద్దకు జనం తోసుకుంటూ వచ్చారు. ఒక దశలో ఆయనే జనాలను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన మేము అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీలో ఆత్మ స్థైర్యాన్ని కలిగించేందుకు జగన్ వరస టూర్లు దోహదపడ్డాయని అంటున్నారు. వైసీపీకి జనంలో ఆదరణ ఉందని చెప్పడానికి ఇవి పనికి వచ్చాయని అంటున్నారు. జగన్ అంటే ఇంకా ప్రజలలో మోజు ఉందని కూడా ఈ పర్యటనలు చాటి చెప్పాయని అంటున్నారు. ఒక విధంగా వైసీపీలో ఆశావహమైన వాతావరణాన్ని పెంచడానికి ఈ టూర్లు ఉపయోగపడ్డాయని చెప్పాలి.
మరో వైపు చూస్తే జగన్ విమర్శలకు ప్రతి విమర్శలు టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వచ్చాయి. నారా లోకేష్ నుంచి అచ్చెన్నాయుడు నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ నుంచి చాలా మంది నేతలు విమర్శల వర్షం కురిపించారు. జగన్ వ్యాఖ్యలను ఆయన విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు.
ఆ విధంగా గడచిన రెండు రోజులుగా చూస్తే ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పాలి. ఒక వైపు వేసవి సెగల సంకేతాలు వస్తూంటే మరో వైపు జగన్ రాజకీయ వేడిని పెంచేశారు. దాంతో 2024 ఎన్నికల తరువాత స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయం గేర్ మార్చుకుంటుందనే అంటున్నారు. ఇక మీదట జనంలో ఉండేందుకు జగన్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న వేళ ఇది ముందస్తు సన్నివేశంగా చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.
ఇక ఏపీలో పాలసీల మీద డిబేట్లు జరిగి చాలా కాలం అవుతోంది. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలే అటూ ఇటూ ఉంటూ వస్తున్నాయి. ఇపుడు కూడా అలాంటి సన్నివేశాలే చూడాల్సి ఉంటుంది. ఏపీ బడ్జెట్ సెషన్ తరువాత ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడిగా మారే అవకాశాలు అయితే పుష్కలంగానే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏపీ పొలిటికల్ హీట్ ఏ తీరానికి తాకుతుందో ఏ రకమైన ఫలితాలను అందిస్తుందో.