ఉరిమి ఉరిమి ఇంచార్జిల మీదనా ?
మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిల పనితీరు మీద ఆయన ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 7 Dec 2024 8:30 PM GMTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంచార్జిల మీద సీరియస్ గానే ఫోకస్ పెట్టారని ప్రచారం సాగుతోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిల పనితీరు మీద ఆయన ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు అని అంటున్నారు. పనిచేయని వారు అవసరం లేదని కూడా స్పష్టం చేయనున్నారు అంటున్నారు.
ఇంచార్జిలు పార్టీతో ప్రజలతో మమేకం కావాలని కనీసం నెలలో ఇరవై రోజుల పాటు ఉండాలన్నది పార్టీ విధానంగా జగన్ పేర్కొంటున్నారు. అలా చేయని వారిని పక్కన పెట్టి వారి స్థానంలో చురుకుగా ఉండే ద్వితీయ తృతీయ శ్రేణి నేతలకు చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది.
వైసీపీ 2024 ఎన్నికల వేళ దాదాపుగా ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిలను మార్చేశారు. పార్టీతో పాటు తాము ఓటమి పాలు కాగానే వారంతా తిరిగి తమ సొంత సీట్లకు వెళ్లిపోయారు. దీంతో ఆయా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఇక వీటిలో కొన్నింటికి ఇంచార్జిలను వైసీపీ అధినేత నియమించారు. మరి కొన్ని చోట్ల నియమించే ప్రక్రియ సాగుతోంది.
అయితే నియమైంచిన వారు సైతం పనిచేయడం లేదని అంటున్నారు. దాంతో జగన్ సీరియస్ అవుతున్నారని టాక్. పార్టీ ఓటమి పాలు అయిందని జనాలలోకి వెళ్ళకపోతే ఎలా అని ఆయన పార్టీ ముఖ్యులతో చెబుతున్నారని అంటున్నారు. చురుకుగా లేని అనాసక్తంగా ఉన్న వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకుని రావాలని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ప్రజలలో నిరంతరం ఉంటే కనుక అటు పార్టీ కేడర్ ఇటు ప్రజలు చెప్పే సమస్యలను వారు అడ్రస్ చేయవచ్చు అన్నది అధినేత ఆలోచన అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇంచార్జిల విషయంలో జగన్ సీరియస్ గా ఆలోచించడం వల్ల ఒక చర్చ అయితే సాగుతోంది. ఇపుడున్న పరిస్థితుల్లో ఇది మంచి పరిణామమే అని అధినేత పార్టీకి కట్టుబడిన వారి విషయంలో ఆదరిస్తూనే పార్టీకి దూరంగా ఉంటున్న వారి విషయంలో తగిన సమయంలో యాక్షన్ తీసుకోవడం స్వాగతించ తగినదే అంటున్నారు.
అయితే ఈ రోజు ఇంచార్జిలుగా ఉన్న వారు వైసీపీ అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యేలుగా ఉంటూ వచ్చారు. అలాగే గెలవని చోట ఇంచార్జిలుగా ఉన్నారు. అలా అయిదేళ్ల కాలంలో వారిని జగన్ పట్టించుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీలో వారిని పక్కన పెట్టేశారని కనీసం అధినాయకత్వం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.
ఆనాడు పార్టీని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అంటున్నారు. ఎక్కడైనా పార్టీ అధికారంలో ఉంటే మరింత బలపడుతుంది కానీ వైసీపీ విషయంలోనే రివర్స్ అయింది అని అంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకోకుడా పార్టీ నాయకులను పక్కన పెడుతూ అవలంబించిన వైఖరి వల్లనే ఈ దుస్థితి వచ్చిందని అంటున్న వారు ఉన్నారు.
ఇక జగన్ చెప్పినట్లుగా నెలలో ఇరవై రోజుల పాటు ఇంచార్జిలు ప్రజలలో ఉండడం అంటే ఈ రోజులలో కుదిరే పనేనా అని అంటున్నారు రాజకీయం ఒక ఖరీదైన వ్యవహారంగా మారిన నేపధ్యంలో జనంలో ఉంటూ వారితోనే గడపాలీ అంటే ఖర్చు తడిసి మోపెడు అవుతుందని అంటున్నారు. ఎన్నికలు ఇంకా నాలుగున్నరేళ్ల సదూర తీరంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
మళ్ళీ అప్పటికి ఎవరిని తెచ్చి టికెట్ ఇస్తారో ఎవరికి అవకాశం వస్తుందో కూడా తెలియని వేళ ఒళ్ళు గుల్ల చేసుకుని ఖర్చు అంతా పద్దు రాసుకుంటూ ఒద్దికగా పనిచేసే వారు ఉంటారా అని అంటున్నారు. అందువల్ల వైసీపీ అధినాయకత్వం తాను చేసిన స్వయంకృతాపరాధం వల్ల ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు లీడర్ల నుంచి ఎక్కువగానే ఆశిస్తోందని అంటున్నారు.
ఏది ఏమైనా వైసీపీ కి ఇపుడు అంతా ప్రతికూలంగానే ఉంది. అందువల్ల ఇంచార్జిలను వారిని కాదని వీరిని తెచ్చినా పెద్దగా మార్పు వస్తుందా అన్న ప్రశ్నలు అయితే ఉండనే ఉన్నాయని అంటున్నారు. మరి ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందని అన్నట్లుగా ఇంచార్జిల మీద పడితే పార్టీకి అది సంక్షేమాన్ని తెస్తుందా లేక సంక్షోభాన్ని తెస్తుందా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.