ఇక.. కంటిన్యూ చేయడమే: జగన్ నిర్ణయం
ఈ మూడు పర్యటనలకు కూడా.. నాయకుల నుంచి రియాక్షన్ ఎలా ఉన్నా.. ప్రజల నుంచి స్పందన అయితే వైసీపీ ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చిందని నాయకులు తెలిపారు.
By: Tupaki Desk | 21 Feb 2025 12:30 PM GMTవైసీపీ అధినేత జగన్.. జనంలోకి వచ్చేందుకు నిన్న మొన్నటి వరకు ముహూర్తాలు పెట్టుకున్నా.. అవి పెద్దగా ఫలించలేదు. అందుకే... ఆయన ఈ 9 మాసాల్లో ఖచ్చితంగా వస్తానని చెప్పినా ప్రజల మద్యకు రాలేక పోయారు. పైగా.. కార్యకర్తలు, నాయకులను ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు. కట్ చేస్తే.. వారు కూడా ప్రజల మధ్యకు రాలేదు. పైగా నాయకుడు లేకుండా వచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ప్రజల మధ్యకు రాక తప్పలేదు.
కారణాలు వేరే అయినా.. జగన్ ప్రజల మధ్యకు అయితే వచ్చారు. విజయవాడలో తన పార్టీ మాజీ ఎమ్మె ల్యే వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. అనంతరం.. గుంటూరులో మిర్చి యార్డు రైతులను పరామర్శించారు. ఈ రెండుపర్యటనలు కూడా వైసీపీ నేతల మాటల్లో చెప్పాలంటే సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఆ మరుసటి రోజే విశాఖలో పర్యటించి.. పార్టీ నాయకుడి కుటుంబానికి ఓదార్పు ఇచ్చారు. ఇది కూడా కంటిన్యూ ప్రోగ్రాం కావడంతో వైసీపీ వ్యూహం మారిందన్న చర్చ సాగుతోంది.
ఈ మూడు పర్యటనలకు కూడా.. నాయకుల నుంచి రియాక్షన్ ఎలా ఉన్నా.. ప్రజల నుంచి స్పందన అయితే వైసీపీ ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చిందని నాయకులు తెలిపారు. గుంటూరులో రైతులు స్వయం జెండాలు కట్టారన్నదినాయకుల మాట. ఇక, విశాఖలోనూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. విజయవాడలో పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ.. ప్రజలు బాగానే వచ్చారన్నది వైసీపీ నేతల టాక్. సో.. జగన్ ఓడిపోయినా.. 11 స్థానాలకు పరిమితమైనా.. ప్రజల్లో ఆదరణ తగ్గలేదని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
దీంతో.. జగన్ తన పర్యటనలను ఇలానే కంటిన్యూ చేస్తారన్నది వైసీపీ చెబుతున్న మాట. ఇక, మా నాయకుడు ప్రజల మధ్య ఉంటారు. అని సీనియర్ నాయకుడు ఒకరు మీడియాకు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. సమస్య ఎక్కడ ఉంటే.. అక్కడకు వెళ్లేందుకు, ప్రజల తరఫున వాయిస్ వినిపించేందుకు కూడా రెడీ అవుతున్నారని చెబుతున్నారు. దీనిని కొనసాగించడం ద్వారా పూర్వ హవాను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు.