ఆ మహిళను కట్టడి చేయడానికే జగన్, జిందాల్ భేటీలు!
తన వద్ద వ్యాపారాలు నేర్చుకోవడానికి జగన్ ముంబైకి వెళ్లి వచ్చి కలిసేవారని జిందాల్ చెప్పారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 3 Sep 2024 11:11 AM GMTకాదంబరి అనే మహిళను ఎలా కట్టడి చేయాలో చర్చించడానికే తరచూ వైఎస్ జగన్, సజ్జన్ జిందాల్ తాడేపల్లిలో కలిసేవారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాంబుపేల్చారు. జిందాల్ తరచూ జగన్ ను కలుస్తుంటే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం వేగవంతమవుతుందని అందరూ అనుకున్నారని.. కానీ ఆయన తరచూ తాడేపల్లి వచ్చి కలుస్తోంది.. కాదంబరి అనే మహిళను కట్టడి చేయడానికని షర్మిల తెలిపారు.
కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్న రోజే సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ జగన్ తో తన పరిచయం ఈనాటిది కాదని చెప్పారన్నారు. జగన్ వయసులో ఉన్నప్పటి తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చాలా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. తన వద్ద వ్యాపారాలు నేర్చుకోవడానికి జగన్ ముంబైకి వెళ్లి వచ్చి కలిసేవారని జిందాల్ చెప్పారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ కు నాలుగోసారి శంకుస్థాపన చేశారని.. ఇందులో రెండుసార్లు జగనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ను జీఎస్‌డబ్ల్యూ (జిందాల్ స్టీల్ వర్క్స్)కి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామని కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో చెప్పారన్నారు.
జిందాల్ స్టీల్ వర్క్స్ రూ.8800 కోట్లతో స్టీల్ ప్లాంట్ కడతాం.. దీన్ని పూర్తి చేస్తామని చెప్పారన్నారు. అంతేకాకుండా 3500 ఎకరాలను జగన్ ప్రభుత్వం జీఎస్‌డబ్ల్యూకి అప్పగించిందన్నారు. జీఎస్‌డబ్ల్యూ అధినేత మరెవరో కాదని.. ఇప్పుడు మనం వింటున్న సజ్జన్ జిందాలేనని షర్మిల తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కడుతున్నవారు జగన్ కు సన్నిహితుడు కాబట్టి అందుకే తరచూ తాడేపల్లి వచ్చి జగన్ ను కలుస్తున్నారని అనుకున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని భావించారన్నారు. స్టీల్ ప్లాంట్ ఇక ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని, రాజశేఖరరెడ్డి కల నెరవేరబోతుందని అనుకున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కట్టేస్తారనే లెవల్ లో బిల్డప్ ఇచ్చారన్నారు. తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లి తరచూ జిందాల్ కలుస్తుంటే వారికి స్టీల్ ప్లాంట్ నిర్మాణం పట్ట చిత్తశుద్ధి ఉందని భావించామన్నారు.
అయితే జగన్, జిందాల్ కలిసింది కాదంబరి అనే మహిళని ఎలా కట్టడి చేయాలని స్కీములు వేయడానికి, మాస్టర్ ప్లానులు వేయడానికి కలిశారనేది ఇప్పుడు తెలుస్తోందన్నారు. కాదంబరిని తొక్కడానికి వారిద్దరూ బుర్రలు పెట్టారని.. అది ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారన్నారు. ఈ బుర్రలను స్టీల్ ప్లాంటు కోసం పెట్టి ఉంటే అది ఇప్పటికి పూర్తయ్యేది అని తెలిపారు.
కాదంబరి తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే సమాజంలో పలుకుబడి, డబ్బు ఉన్న పెద్ద వ్యక్తి ఆమెను తొక్కేశారని మండిపడ్డారు. ఆమెతోపాటు కాదంబరి తల్లిదండ్రులను సైతం జైలులో పెట్టారన్నారు. కాదంబరి తల్లి రిజర్వ్ బ్యాంకులో ఉన్నతోద్యోగి అని, ఆమె తండ్రి సైతం నేవీ ఆఫీసర్ అని.. అలాంటివారిని కొందరు ఐపీఎస్‌లను ముంబైకు పంపి అరెస్టు చేసి తీసుకొచ్చారన్నారు.
కాదంబరి నిజంగా డబ్బుల కోసమే మోసం చేయాలనుకుంటే సజ్జన్ జిందాల్ లాంటి వ్యక్తులు ఆమెకు రూ.50 కోట్లో, రూ.100 కోట్లో ఇచ్చి ఆమె నోరు మూయించేవాళ్లన్నారు. అయితే కాదంబరి ఏ ఒత్తిడికి లొంగకుండా తనకు న్యాయమే జరిగాలని నిలబడిందన్నారు. కాదంబరి తనను కలిసి సహాయం చేయమంటే ఆమె తరఫున కొట్లాడతానని షర్మిల తెలిపారు.
వైఎస్ జగన్.. కాదంబరి విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్ లు ఇలా చేస్తే మీకు తెలియకుండా ఉంటుందా అని జగన్ ను నిలదీశారు. అందులోనూ సజ్జన్ జిందాల్.. జగన్ స్నేహితుడన్నారు. ఈ నేపథ్యంలో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.