Begin typing your search above and press return to search.

ప్రత్యామ్నాయ శక్తిగా షర్మిల ప్రయత్నం సరే కానీ...!

అయితే... ఇప్పుడు కాస్త రూటు మార్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు తెరలేపారు.

By:  Tupaki Desk   |   7 Nov 2024 2:30 PM GMT
ప్రత్యామ్నాయ శక్తిగా షర్మిల ప్రయత్నం సరే కానీ...!
X

ఇంతకాలం మెజార్టీ సమయం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించడానికే కేటాయించినట్లుగా నడుచుకుంటూ.. పత్రికల్లో ఫస్ట్ పేజ్ లో స్థానం సంపాదించుకున్నారు షర్మిల. అయితే... ఇప్పుడు కాస్త రూటు మార్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు తెరలేపారు.

ఇది అధిష్టాణం నుంచి వచ్చిన ఆర్డరా.. లేక, ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నంలో భాగంగా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ఈ నిరసన కార్యక్రమానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఎంత మేరకు సపోర్ట్ వచ్చింది, ఏ మేరకు ప్రచారం దక్కిందనే విషయం కాసేపు పక్కనపెడితే.. ప్రజల నుంచి మాత్రం మంచి స్పందనే కనిపించిందని చెప్పాలి. ఐదు నెలల్లోనే ప్రజలకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందంటూ ఆమె చేసిన విమర్శలకు మంచి రెస్పాన్సే వచ్చింది.

విద్యుత్ సర్ధుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై మోపడుతున్న భారీ భారంపై కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంత సీరియస్ గా ఉన్నారనేది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రం కనిపించనే చెప్పాలి. ఐదు నెలల్లో 17 వేల కోట్ల భారమా.. ఇది న్యాయమా చంద్రబాబు అంటూ షర్మిల వేసిన ప్రశ్నలు జనాల్లోకి బాగానే వెళ్లాయని అంటున్నారు.

"ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారు.. ఇది చాలదన్నట్లుగా మరో రూ.11 వేల కోట్ల భారం సిద్ధం చేస్తున్నారు.. మొత్తం రూ.17 వేల కోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు.. ప్రజలు ఏమి పాపం చేశారు చంద్రబాబు?.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా?" అంటూ షర్మిళ ప్రశ్నించారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ప్రజల తరుపున మొదలు పెట్టిన ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ, మరిన్ని సమస్యలపై ప్రశ్నించే గొంతుక అవుతారా.. లేక, ఇలా అప్పుడప్పుడూ తళుక్కుమని కనిపించి అనంతరం కొంతకాలం అదృశ్యమైపోయాతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. అలా కానిపక్షంలో వీటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు.

ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష వైసీపీ... ప్రభుత్వం తమ కార్యకర్తలపై పెడుతున్న కేసులపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో... ప్రజా సమస్యలపై, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచని విధానంపైనా ప్రజా ఉద్యమాలు చేస్తే అది కచ్చితంగా కలిసొచ్చే అంశమే అని, వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అలా కానిపక్షంలో... ఇది ఆ రోజుకు, ఆ పూటకు చర్చనీయాంశంగా ఉంటుందే తప్ప.. పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరే అంశంగా ఉండదని అంటున్నారు. మరోపక్క పోరాటాలు కంటిన్యూ అవుతాయని కాంగ్రెస్ పార్టీకి ఉన్న శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.