చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల.. ఏం జరిగింది?
ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 48 గంటల డెడ్‌లైన్ విధించారు.
By: Tupaki Desk | 3 Oct 2024 3:37 AM GMTఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 48 గంటల డెడ్‌లైన్ విధించారు. 48 గంటల్లోగా ఆయన స్పందించక పోతే.. తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం యూటర్న్ తీసుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారం.. కొన్నేళ్లుగా వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిని ప్రైవేటీకరించేం దుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఇక్కడి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే.. దీనిని ప్రైవేటు పరం కాకుండా చూస్తున్నామని.. స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్)లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
అయితే.. మరోవైపు తాజాగా సుమారు 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసేశారు. ఈ పరిణామంతో విశాఖ ఉక్కు ఉద్య మం మరోసారి భగ్గుమంది. కార్మికులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖకు వెళ్లిన షర్మిల.. కార్మికులకు మద్దతు పలికారు. వారితో కలిసి నడిరోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటనేది వెంటనే చెప్పాలని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు 48 గంటల్లోగా స్పందించాలని.. ఉక్కు కార్మికులకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లేక పోతే తాను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని తేల్చి చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా షర్మిల నిరసన తెలిపారు. తాజాగా 4 వేల మంది కార్మికులను తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమని నిప్పులు చెరిగారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే.. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవికావన్నా రు. విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన భూములపై ఉన్న శ్రద్ధ.. ఇక్కడి కార్మికులపై కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు. అందుకే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని మండిపడ్డారు. కనీసం రా మెటీరియల్ కొనుక్కోనే పరిస్థితి కూడా కల్పించకపోవడాన్ని ఏమనాలో చెప్పాలని ఆమె నిలదీశారు.
జగన్‌కు ఆ మాత్రం తెలియదా?
ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై షర్మిల నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కు తీవ్ర నష్టాలు కష్టాల్లో ఉంటే.. ఆ విషయం కూడా సీఎం గా ఉన్న సమయంలో ఆయనకు తెలియదట! అంటూ ఎద్దేవా చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీని ఆదుకోవడంలోనూ.. కార్మికులకు భరోసా కల్పించడంలోనూ జగన్ సర్కారు విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని షర్మిల పేర్కొన్నారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు కార్మికులకు భరోసా కల్పించేలా చంద్రబాబు తక్షణం విశాఖకు వచ్చి.. ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 14 వేల మందికిపైగా ఉన్న కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్పందించకపోతే.. తాను నిరవధిక నిరాహార దీక్ష చేయడం ఖాయమని హెచ్చరించారు.