Begin typing your search above and press return to search.

జగనన్నా రాజీనామా చెయ్...చెల్లెమ్మ అల్టిమేట్ డిమాండ్ !

మొత్తానికి అన్న జగన్ కి ముందర కాళ్ళ బంధం వేస్తూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఘాటు విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Nov 2024 4:27 PM GMT
జగనన్నా రాజీనామా చెయ్...చెల్లెమ్మ అల్టిమేట్ డిమాండ్ !
X

వైసీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అసలైన ప్రత్యర్ధి టీడీపీ కూటమి అయినా ఆయన మీద పవర్ ఫుల్ పంచులేయడంలో మాత్రం సొంత చెల్లెమ్మ షర్మిల ఎపుడూ ముందుంటారు అని అంతా అంటారు. ఆమె కూటమి ప్రభుత్వం మీద నిరసనలు చేసినా అందులోనూ జగన్ ప్రస్తావన తెస్తారు. ఆమె విజయవాడ వరదలలో పర్యటించినా జగన్ మాదిరిగా చేయకండి అంటూ కూటమిని డైరెక్ట్ గా విమర్శిస్తూ జగన్ నే ఇండైరెక్ట్ గా విమర్శిస్తారు.

మొత్తానికి అన్న జగన్ కి ముందర కాళ్ళ బంధం వేస్తూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఘాటు విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తనకు మైకి ఇవ్వరని ప్రతిపక్షంగా వైసీపీని గుర్తించరని అందుకే తాను అసెంబ్లీకి వెళ్లడం లేదు అని జగన్ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కాక ముందే చెల్లెమ్మ షర్మిల దాని మీద ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

అసెంబ్లీకి వెళ్లని పదవులు ఎందుకు అంటూ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేయాల్సిందే అని భారీ డిమాండ్ నే ముందు పెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా జగన్ అయినా ఎవరు అయినా అసెంబ్లీకి వెళ్లి తీరాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు.

అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేనపుడు పదవులు ఎందుకు అని ఆమె నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లమని నిర్ణయించుకుంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాల్సిందే అన్నారు. అది జగన్ అయినా వేరు ఎవరు అయినా ఇదే డిమాండ్ అంటూ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మచిలీ పట్నంలో విద్యుత్ నిరసనలో పాల్గొన్న షర్మిల వైసీపీ మీద సంచలన విమర్శలే చేశారు. కేంద్రంలోని బీజేపీకి చంద్రబాబు తో పాటు జగన్ కూడా ఊడిగం చేస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. కేంద్రం ఏపీకి ఇచ్చేది జీరో అని ఆమె దుయ్యబెట్టారు. అయినా సరే ఈ ఇద్దరూ బీజేపీతో సావాసం చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణం అని షర్మిల అన్నారు. అదే సమయంలో జగన్ కూడా బీజేపీతోనే ఉంటున్నారు అని ఆమె చెప్పడం ద్వారా అన్నను బీజేపీతో కలుపుతూ మరోసారి కీలక వ్యాఖ్యలే చేశారు.

మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం మీద నిరసనలు తెలియచేస్తున్నా ఎక్కడా జగన్ ని మాత్రం షర్మిల విడిచిపెట్టడం లేదు, పైగా గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలలో అవకతవకలు జరిగితే కేసులు పెట్టి వారిని శిక్షించండి అంటూ కూటమి ప్రభుత్వ పెద్దలకు సలహా కూడా ఇస్తున్నారు.

జగన్ అసెంబ్లీకి పోను అంటే టీడీపీ కూటమి నుంచి రియాక్షన్ ఇంకా రాలేదు కానీ షర్మిల మాత్రం జగనన్నకు గట్టిగానే కౌంటర్ ఇచ్చేశారు అని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ నుంచి రియాక్షన్ ఏమైనా ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.