'అవివేకం, అజ్ఞానం'... జగన్ పై షర్మిల నిప్పుల వర్షం!
అందువల్ల అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు.
By: Tupaki Desk | 11 Nov 2024 8:14 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అయితే... ఇంత ముఖ్యమైన సెషన్స్ కి వైసీపీ గైర్హాజరైంది. దీంతో వైసీపీ అధినేత జగన్ పై షర్మిల నిప్పులు చెరిగారు. అవివేకం, అజ్ఞానం అంటూ విరుచుకుపడ్డారు.
అవును... అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. ప్రజాసమస్యలపై గొంతెత్తుతామనే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని.. అందువల్ల అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు.
ఈ సందర్భంగా స్పందించిన షర్మిల... అసెంబ్లీకి వెళ్లకూడదనే జగన్ నిర్ణయం.. అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్లుగా ఉందని అన్నారు. అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని గెలిపించిందని అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా... స్వయంకృతాపరాధమే జగన్ కి ప్రతిపక్ష హోదా దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం కచ్చితంగా అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ప్రజల తరుపున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పలు అవకాశాలున్నాయంటూ వాటినీ ప్రస్థావించారు.
ఇందులో భాగంగా... కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కు లేదు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచు కోలేదు.. మహిళలపై దాడులు ఆగడం లేదు.. బెల్టు షాపుల దందాను అరికట్ట లేదు.. ఐదు నెలలు అయినా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.. ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుకయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గు చేటని.. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలనే ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం అని షర్మిల విమర్శించారు. ఈ సందర్భంగా చరిత్రను ప్రస్థావించారు.
ఇందులో భాగంగా... 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. ఉన్న సభ్యులతోనే సభలో ప్రజల పక్షంగా నిలబడిందని.. ఎన్నో సమస్యలపై నాటి టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించిందని తెలిపారు. అదేవిధంగా 2014లో కేంద్రంలో 44 సీట్లకు.. 2019లో 52 సీట్లకే పరిమితం అయినా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రజా సమస్యలపై గొంతెత్తారని అన్నారు.
కాబట్టి... ఇప్పటికైనా పిచ్చితనాన్ని పక్కనపెట్టి అసెంబ్లీకి వెళ్లాలని.. కూటమి నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని.. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే మొత్తం రాజీనామాలు చేయాలని.. అప్పుడు ఇంట్లో కాకపోతే, ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోవచ్చని జగన్ కు షర్మిల తనదైన శైలిలో సూచించారు.