ఏం ‘బాబు’ తగ్గించవా? షర్మిల హాట్ కామెంట్స్
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.109.60, డీజిల్ ధర రూ.97.47గా ఉందని తెలిపారు
By: Tupaki Desk | 25 March 2025 6:58 AMఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, లీటరుకు రూ.17 తగ్గించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.109.60, డీజిల్ ధర రూ.97.47గా ఉందని తెలిపారు. ఇది పక్కనున్న తమిళనాడు (పెట్రోల్ రూ.100.86, డీజిల్ రూ.92.39), కర్ణాటక (పెట్రోల్ రూ.102.90, డీజిల్ రూ.88.99), తెలంగాణ (పెట్రోల్ రూ.107.46, డీజిల్ రూ.95.70) రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. తమిళనాడుతో పోల్చితే ఏపీలో పెట్రోల్‌పై రూ.9, డీజిల్‌పై రూ.5 అధికంగా ఉందని, కర్ణాటకతో పోల్చితే పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.9 అధికంగా ఉందని, తెలంగాణతో పోల్చితే కూడా లీటరుకు రూ.3 అదనంగా ఉందని ఆమె వివరించారు.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు విషయంలో టీడీపీ, వైసీపీలు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లుగా ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ప్రజలను దోచుకున్నాయని, వ్యాట్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో లేనంతగా పన్నులు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టి ప్రజలను లూటీ చేశారని ఆమె ఆరోపించారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారని షర్మిల గుర్తు చేశారు. లీటరుకు రూ.17 తగ్గించాలని డిమాండ్ చేశారని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున వెంటనే లీటరుకు రూ.17 తగ్గించి తమ హామీని నిలబెట్టుకోవాలని షర్మిల స్పష్టం చేశారు. పన్నులు ఘనంగా ఉన్నాయని, అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని ఆమె విమర్శించారు.
గతంలో జగన్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదనపు పన్నుల వసూళ్లను తప్పుబట్టారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయనే బాదుడుకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని షర్మిల ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజల నుంచి సుమారు రూ.50 వేల కోట్లు అదనంగా వసూలు చేశాయని ఆమె ఆరోపించారు.