మీడియా 'ట్రాప్' లో షర్మిల.. !
తాజాగా వైసీపీ అధినేత జగన్ తన పాలనలో విద్యాదీవెన నిధులు ఇవ్వలేదని, 3 వేల కోట్ల రూపాయలకు పైగా పెండింగులో పెట్టారని ఓ మీడియా కథనం రాసింది.
By: Tupaki Desk | 23 Oct 2024 4:15 AM GMTకొంత మంది నాయకులు సబ్జెక్టు ఓరియెంటెడ్‌గా రాజకీయాలు చేస్తారు. ఇది బాగా వర్కవుట్ అవుతుంది. ఇలాంటి నాయకులు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. గతంలో ఎక్కువ మంది నాయకులు సబ్జెక్టు తెలుసుకుని, దాని ప్రకారం రాజకీయాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి వారికి మంచి పేరుతో పాటు వారి ఓటు బ్యాంకును కూడా స్థిరీకరించుకున్న పరిస్థితి ఉండేది. ఉదాహరణకు దివంగత పర్వతనేని ఉపేంద్ర కేంద్ర మంత్రిగా ఉన్నసమయంలో ఆయనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి.
ఈ విషయం ఢిల్లీలో ఉన్న ఆయనను బాధించింది. వెంటనే ఆయన రియాక్ట్‌కాలేదు. తర్వాత.. కొన్నాళ్లకు విజయవాడకు వచ్చి.. గాంధీ భవన్‌లో మీడియా మీటింగ్ పెట్టి.. ఆధారాలతో సహా.. మీడియా రాసిన తప్పులను ఎత్తి చూపించారు. ఇది ఆయనకు మేలు చేసింది. కానీ, ఇప్పుడు ఇలాంటి వారు తగ్గిపోయారు. మీడియా రాసిన రాతలకు పొంగిపోతున్నారు. తమకు అనుకూలంగా ఉంటే.. ఒకలా, లేకపోతే మరోలా రియాక్ట్ అవుతున్నారు. దీనివల్ల వారికి మేలు జరగక పోగా.. మైనస్ అవుతోంది.
తాజాగా వైసీపీ అధినేత జగన్ తన పాలనలో విద్యాదీవెన నిధులు ఇవ్వలేదని, 3 వేల కోట్ల రూపాయలకు పైగా పెండింగులో పెట్టారని ఓ మీడియా కథనం రాసింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. కానీ, కూటమి సర్కారు మౌనంగా ఉంది. అయితే.. వైసీపీపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న షర్మిల.. ఈ కథనాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ``సిగ్గుందా? `` అంటూ.. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇది ఆమెను డిఫెన్స్‌లో పడేసింది.
ఎందుకంటే.. అసలు వాస్తవం వేరు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు .. జగన్ హయాంలో `విద్యాదీవెన` అని పేరు పెట్టారు. ఈ నిధులను అప్పటి వరకు నేరుగా కాలేజీల ఖాతాల్లో వేస్తున్నారు. ఇది కాలేజీ యాజమాన్యాలకు కొమ్ములు వచ్చేలా చేసింది. తాము పాఠాలు చెప్పినా చెప్పకపోయినా.. విద్యార్థులకు వసతులు కల్పించినా లేకున్నా.. తమ డబ్బులు సర్కారు ఇస్తుందన్న భరోసా వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేస్తూ.. విద్యార్థులకు మంచి జరగాలన్న లక్ష్యంతో జగన్ .. సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విద్యాదీవెన నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయడం ప్రారంభించారు. ఈ నిధులను తల్లిదండ్రులు నేరుగా కాలేజీలకు అక్కడి పరిస్థితులు, విద్యను అందిస్తున్న తీరును గమనించి.. ఫీజులు చెల్లించాలని, తద్వారా కాలేజీ ల దూకుడుకు అడ్డు కట్ట వేయొచ్చని జగన్ చెప్పుకొచ్చారు. దీనిని హైకోర్టు కూడా సమర్థించింది. అయితే.. చివరిలో తల్లిదండ్రులకు జమ చేసిన నిధులు కాలేజీలకు చేరలేదు. దీంతో ఆ సొమ్ములు కట్టాలంటూ.. కాలేజీలు ఇప్పుడు కోరుతున్నాయి. ఇదీ.. జరిగింది. కానీ, షర్మిల మీడియా ట్రాప్‌లో పడిపోయి.. అన్నగారిపై అరుపులు కేకలతో విరుచుకుపడడం గమనార్హం.