'చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ'... కడపలో షర్మిళ సంచలన వ్యాఖ్యలు!
అవును... కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. వైఎస్ అవినాష్ రెడ్డిపై స్పందించారు.
By: Tupaki Desk | 20 Nov 2024 9:26 AM GMTవైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెబితే వైఎస్ షర్మిల అంతెత్తున లేచి పడతారని అంటుంటారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతర పరిణామాలు.. ప్రధానంగా కడప ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచీ ఆమె.. అతని విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారని చెబుతుంటారు. ఈ సమయంలో మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల ఫైర్ ఆయ్యారు.
అవును... కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. వైఎస్ అవినాష్ రెడ్డిపై స్పందించారు. ఇందులో భాగంగా... తనతో పాటు విజయమ్మ, సునీతపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని.. అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాష్ ను విచారించి అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. అసలు సోషల్ మీడియాలో అసభ్యకర పొస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డి మూలకారణమని షర్మిల అన్నారు. ఈ సమయంలో.. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు.
ఇక గత పదేళ్లూ స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి.. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏమి చేశారని ప్రశ్నించిన షర్మిల... ఇలాంటి నాయకులను ఎన్నుకునేముందు ప్రజలు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. కడప స్టీల్ ప్లాంట్ కోసం గత ఐదేళ్లలో జగన్ చేసింది కూడా ఏమీ లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా... కడప స్టీల్ ప్లాంట్ ను టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీగానే గత పాలకులు తయారు చేశారని విమర్శించిన షర్మిల.. మీడియా ఎదుట టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థానపలకు పరిమితం అయ్యిందని అన్నారు.
ఇక... పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం వైఎస్సార్ ఎంతో చిత్తశుద్ధితో దీన్ని తీసుకువచ్చారని.. దీని ద్వారా సుమారు 25 వేల మందికి ప్రత్యక్షంగా, దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందని అన్నారు. 20 మిలియన్ల టన్నుల సామర్థ్యంతో దీని నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ఆశయం అని షర్మిల గుర్తుచేశారు!