Begin typing your search above and press return to search.

తాను దిగుతూ...అన్నను దిగలాగుతూ...!

ఈ అన్నా చెల్లెలు సమరం సాగినంత కాలం టీడీపీ కూటమి హాయిగా ఉండవచ్చు. సమీపంలోకి కూడా వచ్చి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షం ఉండదన్న నిబ్బరమూ ప్రదర్శించవచ్చు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:30 PM GMT
తాను దిగుతూ...అన్నను  దిగలాగుతూ...!
X

వైఎస్ షర్మిల రాజకీయం ఆమెకు ఎంతవరకూ కలసి వస్తుందని తెలియదు కానీ ఇది కచ్చితంగా వైఎస్ జగన్ కి అపారమైన నష్టాన్ని కలగచేస్తుందని అంటున్నారు. వైఎస్సార్ రాజకీయ వారసత్వంతో పాటు ఆయన ఆస్తుల విషయంలో గొడవ పడుతున్న అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ వైఎస్సార్ ఆంతకు శాంతి లేకుండా చేస్తున్నారు అనే అసలైన వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.

ఈ విషయంలో ఎవరిది ఎంత తప్పు అన్నది పక్కన పెడితే ప్రతీ ఇంటిలో రామాయణం ఉంటుంది. అది మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి చెప్పినట్లుగానే ఉంటుంది. అయితే ఆ రామాయణాన్ని రావణ కాష్టంగా కాకుండా ఎంత మేరకు తగ్గించుకున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.

ఈ విషయంలో చంద్రబాబుని చాలా వరకూ మెచ్చుకోవాలి. నందమూరి కుటుంబానికి ఆయన అల్లుడు మాత్రమే. అయినా అన్న గారి వారసత్వాన్ని చాకచక్యంగా దక్కించుకున్నారు. ఆ తరువాత కొందరు దారికి వచ్చారు. కొందరు రాలేదు. అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఈ రోజుకి బాబే అన్న గారి వారసుడిగా మిగిలారు.

అక్కడ కూడా వారసత్వం సమస్య ఉంది కానీ అయితే మరీ ఇంతగా వీధుల పడలేదు అని అంటారు. ఇక వైఎస్సార్ వారసుల విషయంలో అటు జగన్ ఇటు షర్మిల ఇద్దరికీ పట్టుదల ఎక్కువే. పట్టుదల ఒక దశ దాటితే కొత్త ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇపుడు అదే జరుగుతోంది.

ఎవరూ తగ్గకపోవడం వల్ల చివరికి వైఎస్సార్ వంటి మహనీయుడికి అపచారం జరుగుతోంది అని అంటున్నారు. వైఎస్ షర్మిల నాయకత్వ లక్షణాలు ఏంటో ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టి మూసివేయడం ద్వారానే అర్ధం అయింది అని అంటారు. తనది కాని చోటు అని ఆమె ముందే గ్రహించలేదా అన్నది కూడా ప్రశ్నగా వస్తుంది. ఇక ఆడ బిడ్డను అన్న ఆమె అక్కడే ఉండి పోరాడి సాధించుకోవాల్సింది.

అలా కాకుండా పార్టీ పెట్టి గట్టిగా రెండేళ్ళు నడపకుండానే కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చారు. ఇక ఆమె తన అజెండా ఏమీ దాచుకోవడం లేదు. అందులోనే ఆమె రాజకీయ అపరిపక్వత ఏంటో తెలుస్తోంది. నిజంగా అన్న నిరాదరణకు గురి అయినట్లుగా ఆమె భావించిన పఖంలో తనదైన పంధాలో కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో రాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఆ విధంగా అన్నకు తానేంటో తన శక్తి సామర్ధ్యాలు ఏంటో చూపించాల్సింది.

కానీ అలా కాకుండా ఈ జనవరిలో పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించడానికి వస్తూ వస్తూనే పోలీసులు ట్రాఫిక్ సమస్యల కోసం కాన్వాయ్ ని ఆపితే భయపడుతున్నారా జగన్ సార్ అంటూ మొదలెట్టి అక్టోబర్ నాటికి తన పీసీసీ చీఫ్ నాయకత్వాన్ని ఏ విధంగా చేసుకుంటూ వెళుతున్నారో అంతా విశ్లేషిస్తున్నారు.

పీసీసీ చీఫ్ గా కంటే అన్న మీద కక్ష సాధింపు రాజకీయానికే ఆమె పరిమితం అవుతున్నారు అన్న చర్చ అంతకంతకు పెరుగుతోంది. జగన్ ని ఈ విధంగా వేధించడమే కాంగ్రెస్ అగ్ర నేతల లక్ష్యం అయితే షర్మిలనే పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తారు. అయితే దాని వల్ల కాంగ్రెస్ కి వీసమెత్తు లాభం లేకపోగా ఆ పార్టీయే ఇబ్బందులలో పడుతుంది.

మరో వైపు చూస్తే షర్మిలకు కాంగ్రెస్ లో పదవులు ఇప్పట్లో దక్కేలా లేవు అన్నది తెలిసిందే. 2029 నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఏపీలో కాంగ్రెస్ అప్పటికి ఎంత కోలుకుంటుందో తెలియదు. కాబట్టి షర్మిల రాజకీయాల్లో అధికార పదవులు అన్నవి ఎప్పటికి దక్కుతాయి అసలు అవి వస్తాయా రావా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈలోగా కాంగ్రెస్ పుంజుకుంటుంది అంటే ఆమె పీసీసీ చీఫ్ పదవికే ఎసరు పెట్టేందుకు అదే పార్టీలో నేతలు తయారుగా ఉంటారన్నది కూడా వాస్తవం.

మరో వైపు చూస్తే షర్మిల ఈ తీరున చేస్తున్న రాజకీయం మూలంగా కచ్చితంగా జగన్ కి భారీ నష్టం కలుగుతుంది. అది మెల్లమెల్లగా జనాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇక వైసీపీ మీద అభిమానం పెంచుకున్న కరడు కట్టిన వైఎస్సార్ ఫ్యాన్స్ లో కూడా పునరాలోచన మొదలైతే మాత్రం వైసీపీకి పూర్తిగా ఇబ్బందులు వచ్చినట్లే.

ఏపీలో వైసీపీ పోరాడాల్సింది బలంగా అత్యంత పటిష్టంగా ఉన్న టీడీపీ కూటమితో.అయితే ఆ వైపు చూడనీయకుండా షర్మిల జగన్ ముందర కాళ్ళకు బంధం వేస్తున్నారు. ఆయనకు ఈ ఇంటి చిక్కులు తీరేదెపుడు అంటే ఎవరూ చెప్పలేరు. మరో వైపు చూస్తే ఇదే తీరున షర్మిల వర్సెస్ జగన్ వార్ సాగితే మాత్రం షర్మిల తాను ఊబిలోకి దిగుతూ జగన్ ని కూడా దిగలాగుతున్నట్లే లెక్క అని కూడా విశ్లేషిస్తున్న వారు ఉన్నారు.

ఈ అన్నా చెల్లెలు సమరం సాగినంత కాలం టీడీపీ కూటమి హాయిగా ఉండవచ్చు. సమీపంలోకి కూడా వచ్చి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షం ఉండదన్న నిబ్బరమూ ప్రదర్శించవచ్చు. మొత్తానికి చూస్తే వైఎస్సార్ వారసులు ఆయన రాజకీయ వారసత్వాన్ని కుటుంబ మర్యాదలను కూడా ఇబ్బందులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు అని సగటు జనం అనుకుంటారు అభిమానులు చేసే ఆవేదనలో నిజం ఉందనే అంటున్నారు.