ఇప్పుడు రాజకీయాలు చేసే సమయమా.. షర్మిలమ్మా?
రాజకీయాలు చేసేందుకు సమయం.. సందర్భం రెండూ ఉంటాయి.
By: Tupaki Desk | 4 Sep 2024 10:16 AM GMTరాజకీయాలు చేసేందుకు సమయం.. సందర్భం రెండూ ఉంటాయి. సమయం చూసుకుని.. సందర్భాన్ని బట్టి రాజకీయాలు చేయాలి. అది నాయకుల విజ్ఞత. పార్టీలకు పద్ధతి కూడా! కానీ, ఈ రెండు మరిచినట్టు గా ఉన్నారు ఏపీసీసీచీఫ్ వైఎస్ షర్మిల. ఏపీ ప్రజలు ఒకవైపు.. వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంటే.. అతి పెద్ద రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో బాధ్యతలు చూస్తున్న షర్మిల.. కనీసం ప్రజల యోగక్షేమాలు విచారించనేలేదు.
వరదలో చిక్కుకున్నవారిని పరామర్శించే పనికీ శ్రీకారం చుట్టలేదు. పోనీ.. సాయం అందించేందుకు కార్యకర్తలు, నాయకులను కూడా రంగంలోకి దింపలేదు. ఆమె అంటే.. మహిళ కాబట్టి రాలేదని తప్పించు కోవచ్చు. కానీ, గత నెలలో పశ్చిమ గోదావరిజిల్లాలో ఎర్రకాలువ పొంగినప్పుడు.. పంటలు మునిగిపోయా యి. అప్పట్లో షర్మిల నేరుగా వెళ్లి.. పీకల్లోతు నీటిలో మునిగి.. రైతుల కష్టాలు వినలేదా? జగన్ సర్కారు ను విమర్శించలేదా? ఒకవైపు ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తుంటే..ఇక్కడ రాజకీయం చేయలేదా?
మరి ఇప్పుడు ఏమైంది? అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది? తమకు సంబంధం లేదు.. అన్నట్టుగానే షర్మిల ఆలోచన చేస్తున్నారా? లేక.. ఏమైనా ఫర్వాలేదు.. అని అనుకుంటున్నారా? అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న విమర్శలు. రాజకీయాలు చేయడం తప్పుకాదు.. కానీ, సమయం లేకుండా రాజకీయాలు చేయడం.. జెత్వానీ-జిందాల్‌విషయాన్ని తవ్వితీయడం ఇప్పుడు అవసరమా? దీనివల్ల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వాంతన చేకూరుతుందా? అనేది షర్మిలే ఆలోచించుకోవాలి.
ఇప్పటికైనా.. ముందుకు వచ్చి... తమ వంతుసాయం చేస్తే.. బాధిత ప్రజలకు ఊరట లభిస్తుంది.. తప్ప.. రాజకీయాలు చేస్తే.. వారి కడుపు నింపదు.. కన్నీళ్లు తుడవదు. కనీసం.. బాధితులకు ఆహారమో.. వస్తువుల సాయమో.. చేస్తే.. అంతో ఇంతో షర్మిల నిజమైన రాజకీయం చేసినట్టు అవుతుంది తప్ప.. ఇంకా అన్నను సెంట్రిక్‌గా చేసుకుని రాజకీయాలు చేస్తే.. ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.