ఆ నీచులెవరో తేల్చండి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Sep 2024 9:23 AM GMTతిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని ఆయన బాంబుపేల్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ వైసీపీ నేతలు సర్వనాశనం చేశారని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయాలకు దేవుడిని కూడా వాడుకోవడం నీచమని మండిపడ్డారు. అబద్దాలు ఆడితే మట్టికొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపినవారెవరో తేల్చాలన్నారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ, టీడీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.
లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయన్నారు.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి మచ్చతెచ్చేలా ఉన్నాయని షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణ ఉన్నత స్థాయి కమిటీతో లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ మహా పాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలని కోరారు. సీఎం చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిల తెలిపారు.
కాగా యూఎస్ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన స్పందించిన తీరు పట్ల షర్మిల అభ్యంతరం తెలిపారు. రాహుల్ నిజాలు మాట్లాడితే.. తీవ్రవాదమంటారా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యముందా అని నిలదీశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. బీజేపీ మతతత్వ పార్టీ, ప్రజల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోందని షర్మిల ధ్వజమెత్తారు.