షర్మిల హడల్. .. వైసీపీలో నిండా గుబుల్ !
అయితే అదంత ఈజీ కాదు, షర్మిల ఇపుడు దెబ్బ తిన్న ఆడ పులి మాదిరిగా వైసీపీని టార్గెట్ చేశారు.
By: Tupaki Desk | 26 Oct 2024 3:43 AM GMTవైసీపీలో ఇపుడు నిండా గుబులే కనిపిస్తోంది. ఎక్కడ లేని బెంగా నేతలలో ఉంది. వైసీపీలో పోయిన వారు పోతున్నారు కానీ వైఎస్సార్ మీద ప్రేమతో ఉన్న వారు జగన్ ని ప్రేమించే వారూ అధికంగానే ఉన్నారు. వారంతా అంత సులువుగా పార్టీని వీడలేరు. వైసీపీకి ఎప్పటికైనా అధికార వస్తుందని తమకు మంచి రోజులు వస్తాయని ఆశించే వారే ఉన్నారు.
ఇపుడు వారికి షర్మిల రూపంలో చింత పట్టుకుంది. చంద్రబాబుతో అయితే నేరుగా పోరాడవచ్చు. టీడీపీ ప్రత్యర్థి గా ఉంది. దాంతో ఎన్ని అయినా మాటలు అనవచ్చు. విమర్శలు తీవ్రంగా చేయవచ్చు. కానీ షర్మిల విషయం అలా కాదు ఆమె వైఎస్సార్ ఏకైక కుమార్తె. జగన్ కి స్వయాన తోబుట్టువు. అలాగని ఆమె ఇంట్లో ఖాళీగా కూర్చున మనిషి కాదు
దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్. ఆమె ధాటీగా మాట్లాడగలదు. ఆమె మాట్లాడింది జనాలకు ఈజీగా రీచ్ చేయగలదు. పైగా ఆడబిడ్డ. దాంతో సెంటిమెంట్ కూడా తోడు అవుతుంది. దాంతోనే ఇపుడు వైసీపీ కిందా మీదా అవుతోంది. షర్మిల చేస్తోంది అంతా రైట్ అని కాదు అలాగని ఆమె వాదనలో పస లేదనీ కాదు.
అసలు ఎందుకొచ్చిన తంటా అని వైసీపీలో సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. వైసీపీకి షర్మిల ఒకనాడు బలం అయ్యారు. ఆమె వేరు పడగానే వైసీపీ వీక్ అయింది. ఆమె ప్రభావం తక్కువే అని చెప్పినా గెలుపునకు ఓటమికి మధ్య ఒక్క ఓటు కూడా కీలకమే. దాంతో పాటు ఆమె 2024 ఎన్నికల్లో సాగించిన తీవ్ర ప్రచారం వైసీపీని డ్యామేజ్ చేసింది.
ఆనాడు వైఎస్సార్ ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉంటుందని చెబితేనే మేము పార్టీలోకి వచ్చామని ఇపుడు వారి మధ్య వివాదాలతో మా రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందుల్లో పెడుతున్నారు అని కూడా సీనియర్లు అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే మాట అన్నారు. మీరంతా ఒక్కటి అని నమ్మి మేము పార్టీలోకి వస్తే ఇపుడు మీరూ మీరూ విడిపోయి మాకు రాజకీయ నష్టం కలిగిస్తున్నారు అని ఆయన అన్నారు.
ఆయన ఆవేదనలో నిజం ఉందని కూడా మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా అన్నారు. ఇక లేటెస్ట్ గా పేర్ని నాని అయితే షర్మిల చేత అప్పట్లో పాదయాత్ర చేయించవద్దు అని జగన్ కి చెప్పాను అని అయినా వినిపించుకోలేదని అన్నారు ఆవిడ చికాకు మనిషి అని నాడు అనుమానించాను అని అదే ఇపుడు నిజం అయిందని కూడా ఆయన చెబుతున్నారు.
మరో వైపు చూస్తే వైఎస్సార్ ముద్దుల కూతురుని తాను అని లోకమంతా ఒక ఎత్తు తాను ఒక్కదాన్ని మరో ఎత్తు అని షర్మిల చెప్పుకుంటున్నారు. అంత ప్రేమ ఉంటే వైఎస్సార్ ఏ ఒక్క కంపెనీలలో షర్మిలను ఎందుకు డైరెక్ట్ గా పెట్టలేదని వైవీ సుబ్బారెడ్డి లా పాయింట్ తీశారు. ఆయన ఉద్దేశ్యంతో షర్మిల మీద వైఎస్సార్ కి ప్రేమ లేదని కాదు, ఆమెకు కుమార్తెగా గౌరవించి ఆమె ఆస్తులను ఆమెకు రాసి ఇచ్చారని ఇక ప్రస్తుతం ఉన్నవి అన్నీ జగన్ స్వార్జితమే అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే రాచమల్లు శివప్రసాదరెడ్డి అయితే జగన్ ని ఏమి చేద్దామని అనుకుంటున్నారని వైఎస్సార్ ఫ్యామిలీని ప్రశ్నించారు. జగన్ వల్లనే తాము రాజకీయాల్లో ఉన్నామని లక్షలాది మంది ఆయనను నమ్ముకుని ఉన్నారని కుటుంబ కలహాలతో ఆయనని ఇబ్బంది పెడితే తామంతా పూర్తిగా ఇరకాటంలో పడాల్సి వస్తుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
మొత్తానికి చూస్తే వీరంతా అంటున్నది ఒక్కటే వైసీపీ మీద షర్మిల నీడను పడకుండా చూసుకోవాలనే. అయితే అదంత ఈజీ కాదు, షర్మిల ఇపుడు దెబ్బ తిన్న ఆడ పులి మాదిరిగా వైసీపీని టార్గెట్ చేశారు. ఈ యుద్ధంలో ఆమె ఏమి కోల్పోయినా ఫరవాలేదు కానీ వైసీపీ కూడా ఉండకూడదు అన్నట్లుగా దూకుడు చేస్తున్నారు. మొత్తానికి వైసీపీకి షర్మిల హడల్ అన్నట్లుగా ఉంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో ఏ మలుపు తిరుగుతుందో.