వైఎస్ వివేకా హత్యలో కీలక పరిణామం!
2019 సార్వత్రిక ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Oct 2024 8:02 AM GMT2019 సార్వత్రిక ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదని.. రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో కేసు విచారణ నత్తనడకన నడుస్తుండటంతో వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది.
అలాగే ఏపీలో కేసు విచారణ సజావుగా సాగడం లేదని.. దీన్ని తెలంగాణ రాష్ట్రానికి మార్చాలని సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా కోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఇప్పటికే సీబీఐ ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి తదితరులను నిందితులుగా చూపింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకోగా మిగిలినవారంతా బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో నిందితుడు సునీల్ యాదవ్ కు కూడా బెయిల్ లభించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడిగా సునీల్ యాదవ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు అతడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కోర్టు తిరస్కరించింది. ఇటీవల అతడు తెలంగాణ హైకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించాడు. అయితే అతడి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.
ఈ క్రమంలో మరోమారు అతడు తాజాగా తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్ తోపాటు రూ.25 వేల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే ఉదయకుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి (కడప ఎంపీ), వైఎస్ భాస్కర్ రెడ్డిలకు హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన ఉన్నారు.
కాగా సీబీఐ నమోదు చేసిన కేసులో దస్తగిరి నాలుగో నిందితుడిగా ఉన్నాడు. వివేకాను చంపడానికి అవసరమైన గొడ్డలిని తానే కొనుక్కు వచ్చినట్టు అతడిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్లపాటు అతడు జైల్లో ఉన్నాడు. తర్వాత అప్రూవర్ గా మారడంతో అతడికి సీబీఐ అంగీకారం మేరకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో అతడు వెల్లడించాడు. దీంతో అప్రూవర్ గా మారడంతో తనను సాక్షిగా పరిగణించాలని చేసిన విన్నపం మేరకు అతడిని నిందితుల జాబితా నుంచి కోర్టు గతంలోనే తొలగించింది.