వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతదేహానికి - రీపోస్టుమార్టం
వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు.
By: Tupaki Desk | 8 March 2025 12:53 PM ISTవివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో ఈ ప్రక్రియను తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల ఆధ్వర్యంలో చేపట్టారు. రంగన్న మృతి పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆయన భార్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.
- రీపోస్టుమార్టం కారణాలు
రంగన్న మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో విచారణలో పారదర్శకత కోసం మృతదేహంపై మరొకసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా రంగన్న మృతికి కారణం ఏమిటి? గాయాలు ఉన్నాయా లేదా? అనే అంశాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. ప్రాథమిక నివేదికలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
- మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన భార్య
వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న అనూహ్యంగా మరణించడంపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న చంద్రబాబ కేబినెట్ మీటింగ్ లోనూ దీనిపై చర్చ జరిగింది. డీజీపీకి ఇది నిగ్గుతేల్చాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగన్న మృతి సహజమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.