రాజకీయ తెర పైకి వైఎస్ భారతి ?
వైఎస్ భారతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కోడలు, తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి
By: Tupaki Desk | 14 Aug 2024 7:30 PM GMTవైఎస్ భారతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కోడలు, తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి. ఆమె గురించి ఇపుడు ఆసక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. వైసీపీ ఈసారి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు అయిన క్రమంలో వైసీపీలో ఏ రకమైన కొత్త కళ కనిపించడం లేదు. దాంతో వైసీపీలో జగన్ తరువాత బలమైన నేతను తీసుకుని రావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.
వైఎస్ జగన్ ఒక్కరే పార్టీని లీడ్ చేయలేకపోతున్నారు. ఆయనకు తోడు నీడగా ఉండడంతో పాటు జనంలో మరో కొత్త ఆకర్షణగా ఉండాల్సిన నేత కోసం సాగుతున్న అన్వేషణ కాస్తా భారతి వద్ద ఆగింది అని అంటున్నారు. నిజానికి వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత మొదట వైఎస్ విజయమ్మను మళ్ళీ పార్టీలోకి తీసుకుని వస్తారని అనుకున్నారు.
అయితే వైఎస్ విజయమ్మ గత ఎన్నికల వేళ న్యూట్రల్ పొలిటికల్ స్టాండ్ నుంచి తప్పుకుని తమ కుమార్తె కాంగ్రెస్ ఏపీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిల వైపు నిలబడ్డారు. దాంతో వైసీపీ క్యాడర్ అంతా ఆమె పైన గుర్రుగా ఉందని వార్తలు వచ్చాయి. అంతే కాదు వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి వారు కూడా తల్లీ చెల్లెళ్ళ వల్లనే పార్టీ దారుణంగా దెబ్బ తిందని కామెంట్స్ చేశారు.
దాంతో పాటు వైఎస్సార్ కుటుంబంలో గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఎన్నికలు ముగిసి వైసీపీ ఓటమి పాలు అయినా కుటుంబంలో సర్దుబాట్లు అయితే లేవు. వైఎస్ జగన్ ఒంటరి పోరాటమే చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీలో ఇపుడు కొత్త చర్చకు తెర లేచింది.
వైఎస్ భారతి తొందరలో రాజకీయ అరంగేట్రం చేస్తారని, ఈ మేరకు వైఎస్ జగన్ దగ్గరుండి మరీ తగిన విధంగా ఆమె పొలిటికల్ అరంగేట్రానికి ఫ్లాట్ ఫారాన్ని తయారు చేస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక వైఎస్సార్ ఫ్యామిలీ కోడలు అయిన భారతికి రాజకీయాలు అయితే కొత్త ఏమీ కాదు, ఆమె కడప ఎన్నికల వేల గతంలో మామ వైఎస్సార్ కోసం ఆ తరువాత భర్త వైఎస్ జగన్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఇపుడు ఆమె ఏపీవ్యాప్తంగా వైసీపీకి కీలక నేతగా పరిచయం కాబోతున్నారు అని అంటున్నారు.
వైసీపీలో చూస్తే మహిళా నేతల కొరత ఉంది. గతంలో వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఆ విధంగా మహిళా ఓటు బ్యాంకు ని ఆకర్షించేవారు. కానీ 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ప్రచారం చేశారు. మహిళల కోసం సంక్షేమ పధకాలు వైసీపీ ఎన్నో అమలు చేసినా దాని కంటే డబుల్ ఇస్తామని టీడీపీ కూటమి చెప్పడంతో జనాలు ఆ వైపుగా మళ్ళిపోయారు.
ఇక అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం రానున్న రోజులలో మహిళలకు ఉచిత బస్సు హామీను అమలు చేస్తే వారు ఆ వైపే ఉంటారు అని కూడా అంటున్నారు. తల్లికి వందనం పేరుతో కార్యక్రమం అమలు చేసినా లేక 18 ఏళ్ళు నిండిన మహిళల ఖాతాలలో నగదు బదిలీ చేసినా వైసీపీని మహిళా జనాలు పూర్తిగా మరచి పోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు.
దీంతో బలమైన గట్టి మహిళా గొంతుక వైసీపీకి అవసరం అని గుర్తించే జగన్ తన భార్య చేత రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారు అని అంటున్నారు. వైఎస్సార్ కోడలిగానే ఆమెను జనంలోకి పంపేలా భారీ ప్రణాళికలను వేస్తున్నారు అని అంటున్నారు. వైఎస్సార్ వారసత్వం కోసం ఒక వైపు కుమార్తె షర్మిల పీసీసీ చీఫ్ గా కాచుకుని కూర్చున్నారు. అయితే కోడలుగా ఆయన ఇంటి పేరుతో ఉన్న భారతికే ఎక్కువ వారసత్వ అధికారాలు ఉంటాయన్నది వైసీపీ వ్యూహకర్తల భావనగా ఉంది.
అందువల్ల వైఎస్సార్ కోడలిగా భారతిని జనంలోకి తెస్తే కచ్చితంగా కాంగ్రెస్ కి షర్మిలకు కూడా ధీటైన చెక్ పెట్టవచ్చు అన్నది మరో వ్యూహంగా ఉంది అని అంటున్నారు. వైఎస్ భారతి చేత షర్మిలకు కౌంటర్లు ఇప్పించడం ద్వారా ఆమె వైపు నుంచి వచ్చే విమర్శలకు సరైన జవాబు చెప్పించవచ్చు అని కూడా అంటున్నారు.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మాత్రం వైఎస్ భారతి రాజకీయ అరంగేట్రం కొత్త ఏడాది అంటే 2025 జనవరిలో జరగవచ్చు అనీంటున్నారు. గతంలో వైఎస్ భారతి రాజకీయ ప్రవేశానికి షర్మిల రూపంలో అడ్డు ఉందని ఇపుడు అలాంటి పోటీ కూడా లేదని ఇదే మంచి తరుణం అని కూడా భావిస్తున్నారుట.
వైఎస్ భారతి రాజకీయ అరంగేట్రం అదిరిపోయే రేంజిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమెను జనంలోకి ఎప్పటికపుడు పంపిస్తూ ఏపీవ్యాప్తంగా ఆమె పర్యటనలు ఉండేలా చూసుకుంటూ వైసీపీని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక కీలకమైన సమయంలో జగన్ ఏపీ రాజకీయ తెర మీదకు వస్తారు. ఆ విధంగా వైసీపీ అయితే మాస్టర్ ప్లాన్ వేసింది అని అంటున్నారు. మొత్తానికి వైఎస్ భారతి రాజకీయ అరంగేట్రం వార్తలు ఇపుడు ఏపీలో రాజకీయ ప్రకంపలను సృష్టిస్తున్నాయి.