Begin typing your search above and press return to search.

తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేందర్.. నాటి వైఎస్ మాటలు వైరల్!

అంతేనా.. ‘రాజేంద్రా.. ఎన్ని సీట్లు పోటీ చేశారయ్యా మీరు? యాభై. గెలిచింది ఎన్ని పది. యాభై స్థానాల్లో పోటీ చేసి పట్టుమని పది గెలవలా.

By:  Tupaki Desk   |   5 Jun 2024 4:33 AM GMT
తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేందర్.. నాటి వైఎస్ మాటలు వైరల్!
X

నాటి నిండు సభలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నోటి నుంచి బుల్లెట్ల మాదిరి వచ్చిన మాటలు తర్వాతి రోజుల్లో తెలంగాణ ప్రజల్ని ఎంతలా రగల్చియో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటల రాజేందర్ ను ఉద్దేశించి.. తెలంగాణ సెంటిమెంట్ ను రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ వాడుకుంటున్నారని.. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారని నిప్పులు చెరిగారు.

అంతేనా.. ‘రాజేంద్రా.. ఎన్ని సీట్లు పోటీ చేశారయ్యా మీరు? యాభై. గెలిచింది ఎన్ని పది. యాభై స్థానాల్లో పోటీ చేసి పట్టుమని పది గెలవలా. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా?’ అంటూ అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే.. 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న నాటి టీఆర్ఎస్ యాభై స్థానాల్లో పోటీ చేస్తే పది సీట్లు మాత్రమే గెలుచుకుంది. తాజాగా వెల్లడైన ఫలితాల్ని చూసినప్పుడు ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. గెలుచుకున్న సీట్లు 11 మాత్రమే.

అంటే.. నాటి టీఆర్ఎస్ కన్నా మూడున్నర రెట్లు సీట్లలో పోటీ చేసి.. దానికి వచ్చిన సీట్లతో పోలిస్తే ఒక్కటంటే ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించిన వైనం చూస్తే.. ఎంతటి దారుణాతి దారుణమైన ఓటమి వైసీపీ ఎదుర్కొందన్న విషయం అర్థమవుతుంది. పది సీట్లు సాధించినందుకు తల ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేందర్ అన్న వైఎస్ మాటలు.. అనూహ్యంగా తాజా ఎన్నికల ఫలితాల్లో ఆయన కుమారుడు జగన్ కు వర్తించే పరిస్థితి రావటం గమనార్హం.

విశ్వసనీయత ఉంది మీకా? మాకా? అన్న మాటల్ని వైఎస్ తరహాలో తెలుగుతమ్ముళ్లు ఎవరైనా విరుచుకుపడితే సమాధానం చెప్పలేని ఇబ్బందికర పరిస్థితుల్లో వైసీపీ ఉంది? నాటు ఈటలను తల ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేందర్ అన్న మాటలు.. రానున్న రోజుల్లో ఏదో రోజు జగన్ సైతం ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ కూటమి చారిత్రక గెలుపు యావత్ దేశం ఏపీ వైపు చూసేలా చేసిందని చెప్పాలి.