Begin typing your search above and press return to search.

సజ్జలకు చిరాకు తెప్పించిన ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అసలేమైందంటే?

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారుగా సుపరిచితుడు సజ్జల రామక్రిష్ణారెడ్డికి అనుకోని రీతిలో షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   16 Oct 2024 4:50 AM GMT
సజ్జలకు చిరాకు తెప్పించిన ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అసలేమైందంటే?
X

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారుగా సుపరిచితుడు సజ్జల రామక్రిష్ణారెడ్డికి అనుకోని రీతిలో షాక్ తగిలింది. విదేశాల నుంచి ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయన.. బయటకు వచ్చే వేళలో... ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను నిలువరించారు. ఆయన్ను పక్కన కూర్చోబెట్టారు. ఈ వ్యవహారంలో సజ్జల సీరియస్ అయ్యారు. తనకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉందని చెప్పగా.. ఆ అంశాన్ని కన్ఫర్మ్ చేసుకుంటామని ఆయన్ను పక్కన కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులపై సజ్జల సీరియస్ అయ్యారు.

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సజ్జల రామక్రిష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయనపై గుంటూరు పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. దీంతో.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చిన సజ్జలను ఆపేశారు. తనపై ఎలాంటి కేసులు లేవని.. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉందని ఆయన వాదించగా.. తాము క్రాస్ చెక్ చేసుకుంటామని.. అప్పటివరకు వెయిట్ చేయాలని కోరారు. అధికారుల తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించినట్లు చెబుతున్నారు.

గుంటూరు పోలీసుల నుంచి తమకు అందిన లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో సజ్జలను తాము అడ్డుకున్న విషయాన్ని తెలియజేస్తూ.. గుంటూరు ఎస్పీకి సమాచారం అందజేశారు. అయితే.. సజ్జల ప్రస్తుతం సుప్రీంకోర్టు రక్షణ పొందారని.. ఆయన్ను అదుపులోకి తీసుకోవద్దని ఈమొయిల్ రూపంలో గుంటూరు ఎస్పీ సమాచారం అందించారు. దీంతో.. ఆయనకు బయటకు పంపారు. అదే సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల నిందితుడేనని గుంటూరు పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

ఆయన్ను దేశం విడిచి పెట్టి వెళ్లకుండా 15 రోజుల క్రితం అన్ని ఎయిర్ పోర్టులకు సమాచారం పంపారు. ఈ క్రమంలో విదేశాల నుంచి ల్యాండ్ అయిన ఆయన్ను ముంబయి ఎయిర్ పోర్టులో అడ్డుకునానరు. అయితే.. గుంటూరు పోలీసులు సజ్జలపై లుక్ వుట్ నోటీసులు ఇవ్వటానికి ముందే ఫారిన్ కు వెళ్లటంతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చినట్లుగా చెబుతున్నారు. గుంటూరు పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుకు సుప్రీంకోర్టు రక్షణ ఉన్నప్పటికీ ఆయన్ను విచారించొచ్చని.. కేసును సీఐడీకి బదిలీ చేయటంతో.. సంబంధిత అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు. అయితే.. చట్టప్రకారం నోటీసులు పంపి ఆయన్ను విచారణకు పిలిచే వీలుందన్న మాట వినిపిస్తోంది.