Begin typing your search above and press return to search.

జగన్ కి అదే శ్రీరామ రక్ష ?

వైసీపీకి ఇపుడు ఇంతటి కష్టాల్లోనూ ఊరట ఏంటి అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తనతోనే ఉండడం.

By:  Tupaki Desk   |   25 Jun 2024 3:51 AM GMT
జగన్ కి అదే శ్రీరామ రక్ష ?
X

వైసీపీకి ఇపుడు ఇంతటి కష్టాల్లోనూ ఊరట ఏంటి అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తనతోనే ఉండడం. అది ఎన్నాళ్ళూ అంటే కొన్నాళ్ళ వరకైనా వారు ఉంటారు అని అంటున్నారు. అది పార్టీ మీద అభిమానమా లేక మరోటా అంటే రాజకీయ పరిస్థితులే కారణం అని అంటున్నారు.

ఎందుకు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించ దలచుకోలేదు అని అంటున్నారు. ఆయన పార్టీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు. దాంతో ఆయనకు ఉన్న వారే అతి పెద్ద బలంగా ఉన్నారు. వారితో పాటుగా పార్టీని మొదటి నుంచి అట్టిపెట్టుకున్న వారు పార్టీలో చేరుతున్న కొత్త నీరు ఇలా టీడీపీ బలంగానే ఉంది.

దాంతో అనవసరంగా వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకుని ఏమి లాభం అన్నదే ఆలోచన. పైగా గతంలో తీసుకుని ఇబ్బందుల పాలు అయ్యామని విమర్శలు వచ్చాయని కూడా టీడీపీ అధినాయకత్వానికి ఎరుక ఉంది. ఇక ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నా లాభం ఏమీ లేదు. వైసీపీకి అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఉంటే జగన్ కి విపక్ష నేత హోదా లేకుండా చేశామని చెప్పుకునే రాజకీయ వ్యూహంగా ఉంటుంది. అలాగే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే మండలి రాజ్యసభ ఎన్నికల్లో వారు పోటీకి వస్తారు అన్న ఆలోచనతో బలం తగ్గించవచ్చు.

ఇపుడు అలాంటిది ఏదీ లేదు. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీలు అన్నీ కూడా టీడీపీ కూటమికే దక్కుతాయి. అంతలా నీరసించిన నంబర్ తో వైసీపీ ఉంది. దాంతో వారిని అలాగే వదిలేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. తన పార్టీ వారికి కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తే రానున్న కాలంలో పార్టీ బలోపేతం అవుతుదని అదే 2029 విజయానికి నాంది అవుతుందని బాబు భావిస్తున్నారుట.

ఇక మిత్రపక్షాలు చూస్తే జనసేన కూడా సొంతంగా ఎదగాలని చూస్తోంది. అధికారంలోకి సొంతంగా రావాలంటే ఇదే తగిన సమయం అని ఆలోచిస్తోంది. దాంతో ప్రజలలో పేరున్న వారు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన కొత్త వారిని చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక కూటమిలో జనసేన కూడా ముఖ్య పాత్ర కాబట్టి టీడీపీ మాదిరిగానే వైసీపీ నేతలను దూరం పెట్టాలనే అనుకుంటోందిట.

బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి బలం తక్కువగానే ఉంది. తీసుకోవాలని కేంద్ర పెద్దలకు ఉంటే ఉండొచ్చు కానీ దానికి టీడీపీ జనసేన విముఖంగా ఉండడమే ఇబ్బంది అని అంటున్నారు. లోక్ సభలో బీజేపీకి ఎంపీల కొరత ఉంది. నలుగురు వైసీపీ నుంచి గెలిచారు. అందులో కొందరు వస్తామని అంటున్నారని అయినా తమ పార్టీ చేర్చుకోదని బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న మాటలలో నిజం ఉంది. టీడీపీ జనసేనలకు కోపం తెప్పించే విధంగా ఈ వలసలను బీజేపీ ససేమిరా ప్రోత్సహించదు అని అంటున్నారు.

ఇక ఏపీలోనూ బీజేపీ స్టాండ్ అలాగే ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఏ విధంగా చూసుకున్నా వైసీపీకి ఇప్పట్లో జంపింగుల బెడద అయితే లేదు అని అంటున్నారు. అదే విధంగా వైసీపీ మాజీ మంత్రులు సీనియర్ నేతల విషయంలోనూ పాత ముఖాలతో రాజకీయం వద్దు అని కూటమి పెద్దలు భావిస్తున్నారుట. దాంతో వారికి కూడా చాన్స్ లేదు అని అంటున్నారు. ఈ కారణాలు అన్నీ కలిపి చూస్తే ఇప్పట్లో వైసీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్ళేది లేదు అని స్పష్టం అవుతోంది.

అయితే శాసనమండలిలో ఎవరైనా ఫిరాయిస్తారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకు అంటే అక్కడే వైసీపీకి బలం ఉంది. కానీ అక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు అని కూటమి గట్టిగా నిర్ణయించుకుంటే వైసీపీ సేఫ్ జోన్ లో ఉన్నట్లే. అయితే మండలిలో ప్రతీ బిల్లుకూ అడ్డగోలుగా వైసీపీ అడ్డుపడితే మాత్రం కూటమి పెద్దల ఆలోచనలలో మార్పు రావచ్చు అని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి అయితే వైసీపీ సేఫ్ గానే ఉంది అని అంటున్నారు.