బాబును వదలని జగన్...ఈసారి గట్టిగానే !
By: Tupaki Desk | 7 Sep 2024 4:54 PM GMTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. మరోసారి ఆయన ఒక భారీ విమర్శల జడివానను ట్విట్టర్ ద్వారా కురిపించారు. బాబూ మీకూ మంత్రి నాదెండ్ల మనోహర్ కి మధ్య జరిగిన సంభాషణ లోకమంతా వైరల్ అయింది. మీ బేలతనం అందులో కనిపించింది అని ఎత్తి పొడిచారు.
అసలు మీ అసమర్ధ నిర్వాకం భారీ వానలు వరదల కంటే ఎక్కువ నష్టం తెచ్చిపెట్టింది అని జగన్ నిందించారు. వానలు తగ్గినా కూడా సహాయం అందించకపోవడం ప్రభుత్వం చేతగాని తనం కాక మరేమిటి అని ఎత్తిపొడిచారు. మీరు గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా దేశంలో ఎక్కడా ఎవరూ ఇవ్వని సాయం చేస్తున్నట్లుగా ఇచ్చే బియ్యం, పప్పులు అన్నీ కూడా గతంలోనూ అందరూ ఇచ్చినవే.
కాకపోతే మీరు మాత్రం అరకొరగా ఇస్తున్నారు. అది కూడా వరద నీటితో వచ్చి మరీ బాధితులు తీసుకునేలా కష్టాని వారి మీద పెడుతున్నారు. ఎనభై వేల మంది బాధితులు ఉంటే కేవలం 15 వేల మందికి మాత్రమే సాయం అందిందని మీరే చెప్పారు అంటే ఇంతకంటే వైఫల్యం ఏమి ఉంటుంది అని జగన్ విమర్శించారు.
విజయవాడలో సందు సందునా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని జగన్ అన్నారు. ఏపీలో లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. అంతే కాదు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అలాంటి ప్రభుత్వన్ని నడుపుతున్న మీరు ఇంత అసమర్ధ పాలన ఎలా చేస్తున్నారు అని జగన్ విమర్శించారు. మీరు వాలంటీర్ల వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థ మీద కక్ష పెంచుకోకపోతే ఈ పాటికి డోర్ డెలివరీ రూపంలో అందరికీ అన్ని రకాల సాయాలు అందేవి కాదా అని ప్రశ్నించారు.
అసలు ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28న వాతావరణ శాఖ హెచరించినా రెండున్నర రోజుల పాటు టైం వేస్ట్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. జలాశయాలు నిండుకున్నాయని తెలిసినా వాటిలోని నీటిని ముందుగా విడుదల చేసి వరద నీటికి సర్దుబాటు చేయకపోవడంలో కూడా శ్రద్ధ చూపించలేదు కదా అని ప్రశ్నించారు.
వానలు వచ్చి వారం పై దాటినా ఇంకా ప్రజలు వరదలలో ముంపులో అలా అల్లాడిపోతున్నారు అంటే మీ పాలనను ఏమనాలని నిలదీసారు. మాట్లాడితే మూడు రోజులలో ముప్పై సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెబుతుననరు కానీ అదేమీ అసాధారణం కాదని గతంలోనూ కురిసిన సందర్భాలు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు.
కనీసం వరద బాధితులకు సరిపడా సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేకపోయారు అని ఆయన నిందించారు. బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించ లేకపోవడం కేవలం మీ పాలనలోనే జరిగింది అని బాబుని కార్నర్ చేశారు. ఇప్పటికైనా బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని లేకపోతే మాత్రం మేము పోరాటాలకు సిద్ధం కాక తప్పదని జగన్ హెచ్చరించారు. మొత్తానికి బాబుకు వరదలు వరస వాయుగండాలు ప్రకృతి విపత్తులు సవాళ్ళు విసురుతూంటే విపక్షం అంతే ధాటిగా ఘాటుగా టార్గెట్ చేస్తోంది. ఇది ఏ విధంగా సాగుతుందో ముందు ముందు చూడాల్సి ఉంది.