Begin typing your search above and press return to search.

'దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్'.. బిగ్ షాకిచ్చిన జగన్!

ఇది కచ్చితంగా... ఫ్యామిలీ మేటర్ ఫలితంగా దువ్వాడకు జగన్ ఇచ్చిన షాక్ గానే పరిగణించాల్సిన పరిస్థితి.

By:  Tupaki Desk   |   23 Aug 2024 4:29 AM GMT
దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్.. బిగ్  షాకిచ్చిన జగన్!
X

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన విషయాల్లో 'దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్' ఒకటనే సంగతి తెలిసిందే. టీవీ సీరియల్ ను తలదన్నే స్థాయిలో ఎన్నో ట్విస్టులు, జలక్కులతో ఈ వ్యవహారం సాగింది. రోజుకో సరికొత్త ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు.. దువ్వాడకు షాకిచ్చారు.

అవును... ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శ్రీను తన "స్నేహితురాలు" మాధురీలపై ఆయన భార్య వాణి, కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు. మరోపక్క మాధురి కూడా... తమది సహజీవనం కాదని, అడల్టరీ బంధమని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో పలు కేసులు కూడా నమోదైన పరిస్థితి. ఇక దువ్వాడ శీనివాస్ అయితే... తన భార్య, కుమార్తెపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఫ్యామిలీ మేటర్ సంగతి అలా ఉంచితే.. మరోపక్క నియోజకవర్గంలో కేడర్ అయోమయంలో పడిందనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈ సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా... టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆయనను పక్కకు తప్పించారు. ఈ సమయంలో దువ్వాడ శ్రీను స్థానమంలో పేరాడ తిలక్ ను నియమించారు. ఇది కచ్చితంగా... ఫ్యామిలీ మేటర్ ఫలితంగా దువ్వాడకు జగన్ ఇచ్చిన షాక్ గానే పరిగణించాల్సిన పరిస్థితి.

కాగా... గతంలో పేరాడ తిలక్ టెక్కలి సమన్వయకర్తగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇదే సమయంలో. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తిరిగి టెక్కలి అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తగా నియమించారు జగన్.

మరోపక్క... పార్టీకి సంబంధించి మరికొన్ని కీలక పదవులను కూడా జగన్ భర్తీ చేశారు. ఇందులో భాగంగా కో-ఆర్డినేషన్ కి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని తాజాగా నియమించారు. ఇదే క్రమంలో అనుబంధ విభాగాలకు సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చెవిరెడ్డికి ఇచ్చారు.

ఇదే నేపథ్యంలో... కీలకమైన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించిన జగన్... బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా చిరంజీవి గంజి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు.