Begin typing your search above and press return to search.

జగన్ కి అండగా ఎవరు...దండగ ఎవరు ?

ఇక జగన్ కి ఈ కష్టకాలంలో అండగా ఉన్న నేతలు ఎవరూ అన్నది ఒక్కసారి చూసుకుంటే కనుక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 8:30 PM GMT
జగన్ కి అండగా ఎవరు...దండగ ఎవరు ?
X

కష్టకాలంలోనే ఎవరి విలువ అయినా తెలిసి వస్తుంది. మిత్రుడు అయినా బాగా ఉన్నపుడు కలిస్తే సుఖం లేదు బాధలలో ఉన్నపుడు ఓదార్పు ఇస్తే వారినే నిజమైన మిత్రుడుగా ఎవరైనా భావిస్తారు. అలగే ఒక పార్టీకి కూడా అండగా ఉండాల్సింది అధికారంలో ఉన్నపుడు కాదు, సంక్షోభ సమయంలో.

అధికారంలో ఉన్నపుడు ఎవరైనా వస్తారు. చుట్టరికాలు కలుపుకుంటారు. నిండా నీరున్న చెరువులో తామర తంపగా కప్పలు వస్తాయని చెబుతూ ఉంటారు. అలాగే అధికారం కూడా ఉంటుంది. అది దూరం కాగానే నిజంగా మిగిలేది ఎవరు. పార్టీని అట్టేబెట్టుకున్నది ఎవరు.

వైసీపీలో ఇదే ఇపుడు చర్చగా సాగుతోంది. ఇది వైసీపీ సమస్య మాత్రమే కాదు, టీడీపీ కూడా 2019 నుంచి 2024 మధ్యలో ఇలాగే అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోంది. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబు సైతం నాడు పార్టీని నిలబెట్టుకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది.

ఇది ఏ పార్టీకి అయినా కామన్. పార్టీని కలిపి ఉంచేవి ఒకప్పుడు సిద్ధాంతాలు. ఇపుడు పార్టీలు అన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా మారిపోయాక వాటితో నేతలకు సంబంధం ఉండడం లేదు. గెలుపు ఓటములు అంతా అధినేతల మీదనే పోతోంది. వారే ఆ క్రెడిట్ ని అయినా లేక ఒటమిని అయినా తీసుకోవాల్సి వస్తోంది.

దాంతో నేతలు పార్టీ బాగుంది, గెలుపు గుర్రం అనుకుంటే ఎక్కుతున్నారు. లాభం లేదు అనుకుంటే దిగి పోతున్నారు. వ్యక్తి పూజ గత కొన్ని దశాబ్దాలుగా బాగా పెరిగిపోయిన నేపథ్యం ఇది. అంతే కాదు రాజకీయం అంటే సేవా భవం తగ్గిపోయి వేరే విధంగా వాడుకునేందుకు ఆస్కారం ఇస్తున్న కాలమిది.

దాంతో విపక్షంలోకి వచ్చాక ఎంత గండర గండ రాజకీయ నేతలు అయినా ఢక్కామెక్కీలు తినాల్సిందే. తెలంగాణాలో కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు కూడా పార్టీని ఖాళీ చేసి నేతలు పోతూంటే ఏమీ చేయలేకపోతున్నారు. ఇది కాని కాలం అని సరిపుచ్చుకుంటున్నారు.

ఏపీలో చూస్తే అదే విధమైన పరిస్థితి ఉంది వైసీపీకి. ఇక జగన్ కి ఈ కష్టకాలంలో అండగా ఉన్న నేతలు ఎవరూ అన్నది ఒక్కసారి చూసుకుంటే కనుక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు. ఘోరమైన ఓటమి తరువాత జగన్ చుట్టూ కేవలం ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

వీరే గతంలో పార్టీలో కొంత వరకూ చక్రం తిప్పారు. జగన్ కి అన్ని విధాలుగా నీడగా ఉంటూ వచ్చారు. వీరు తప్పించి జిల్లా స్థాయిలలో పెద్ద లీడర్లు అనిపించుకున్న వారు ఎవరూ ముఖం చూపించడం లేదు అని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అంతా తామే అని అని చక్రాలు గిర్రున తిప్పిన వారు అయితే ఇపుడు అయిపూ అజా లేకుండా పోయారు అని అంటున్నారు.

చిత్రమేంటి అంటే వీరికి కబురు పెట్టిన రివ్యూ మీటింగ్స్ కి కూడా రావడం లేదు అని అంటున్నారు. సొంత వ్యాపారాలు వ్యాపకాలలో బిజీ అయిపోయారు అని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి జగన్ కి వెరీ క్లోజ్ అని చెప్పుకుని బిల్డప్ ఇచ్చిన వారంతా ఇపుడు ఎక్కడ ఉన్నారు అని వైసీపీలో చర్చ సాగుతోంది.

జగన్ తాడేపల్లి వచ్చినా లేక జిల్లాల పర్యటనకు వెళ్ళినా కూడా చాలా మంది నేతలు ఆయన పక్కన లేకపోవడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో బిగ్ షాట్స్ గా ఉన్న నేతలు ఈ విధంగా చేయడం పట్ల చర్చ సాగుతోంది. అయితే వారు తెలివిగానే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. జగన్ పక్కన ఉంటే తమ మీద కూడా కేసులు ఎక్కడ పెడతారో అన్న భయంతో పాటు ఏపీలో ఉంటే అధినాయకత్వానికి సన్నిహితంగా ఉంటే పార్టీ ఖర్చులు పెరుగుతాయని ముందస్తు జాగ్రత్తలతోనే చాలా మంది తప్పుకుంటున్నారు అని అంటున్నారు.

అయితే దీని మీద జగన్ సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. పార్టీ ఓటమి చెందిన తరువాత కీలక నేతలు కనిపించకపోతే ఎలా అని ఆయన సన్నిహితులతో అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం ఈ అయిదేళ్ళూ పనిచేసే వారికే 2029లో అవకాశాలు ఉంటాయని కూడా ఆయన కచ్చితంగా చెబుతున్నట్లుగా తెల్సుతోంది. మొత్తానికి వైసీపీ హై కమాండ్ కి ఓడితే కానీ తర్వతం బోధపడలేదు అని అంటున్నారు.