జగన్ కేసీఆర్ త్వరలో కలయిక ?
ఈ ఇద్దరూ కలసి 2014 ముందు నుంచే రాజకీయంగా ఒకే మాటగా సాగుతున్నారు అని అంటారు
By: Tupaki Desk | 19 Jun 2024 2:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల అధినేతలు తొందరలో కలవబోతున్నారా అంటే జవాబు అవును అనే గాసిప్స్ కింద పొలిటికల్ సర్కిల్స్ లో వస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇద్దరూ 2019 నుంచి 2024 మధ్యలో ఏపీని తెలంగాణాను పాలించారు. ఈ ఇద్దరి మధ్యన మంచి రిలేషన్స్ ఉన్నాయి.
ఈ ఇద్దరూ కలసి 2014 ముందు నుంచే రాజకీయంగా ఒకే మాటగా సాగుతున్నారు అని అంటారు. 2014లో తెలంగాణాలో కేసీఆర్ గెలిచి తొలిసారి సీఎం అయ్యారు. ఇక ఏపీలో ఆనాడే జగన్ అధికారంలోకి వస్తారు అని అప్పటి టీఆర్ఎస్ నేతలు జోస్యం చెబుతూ వచ్చారు. కానీ రివర్స్ గా రిజల్ట్స్ వచ్చాయి. ఏపీలో చంద్రబాబు వచ్చారు.
ఇక 2018లో కేసీఆర్ రెండవ మారు తెలంగాణా సీఎం కావడం, 2019లో జగన్ ఏపీలో గెలవడం జరిగిపోయాయి. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలా ఈ ఇద్దరి మధ్య రాజకీయ బంధం కొనసాగుతూనే వస్తోంది.
ఈ నేపథ్యంలో చూస్తే ఇపుడు ఇద్దరూ రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలో ఓడిన కేసీఅర్ తాజాగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటునూ తేలేకపోయారు. మొత్తానికి తెలంగాణాలో బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
ఏపీలో చూస్తే జగన్ కచ్చితంగా రెండవమారు అధికారంలోకి వస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉండేవారు. వై నాట్ 175 అని వైసీపీ కూడా పవర్ ఫుల్ స్లోగన్ వినిపిస్తూ వచ్చింది. కానీ చివరికి 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడం ద్వారా దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది.
ఇపుడు కేసీఅర్ తో పాటు జగన్ కూడా మాజీ సీఎం అయ్యారు. ఇలా మాజీ సీఎం ట్యాగ్ తగిలించుకోవడం ఇద్దరికీ తొలిసారిగానే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే దక్షిణాది నుంచి కేసీఆర్ జగన్ ఇద్దరూ ఒకనాడు బలమైన నేతలుగా కనిపించేవారు.
కేసీఆర్ అయితే ఈ బలాన్ని చూసుకునే మూడో ఫ్రంట్ కేంద్రంలో అని తన జాతీయ ఆకాంక్షను బయటపెట్టుకుంటూ ఉండేవారు. అయితే ఓడలు బళ్ళు అయ్యాయి. ఇపుడు ఇద్దరి చేతిలో పవర్ లేదు. ఇద్దరి అధికార చక్రాలు ఠక్కున ఆగిపోయాయి. అనూహ్యంగా ఓటములు రెండు పార్టీలను పలకరించాయి. బీఆర్ఎస్ అయితే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు, అసలు బోణీ కొట్టలేకపోయింది. ఇది బీఆర్ఎస్ చరిత్రలో ఘోర పరాభవంగా ఉంది.
వైసీపీ వరకూ చూస్తే పార్టీ పెట్టిన కొత్తల్లోనే వచ్చిన ఉప ఎన్నికల్లోనే 15 ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ ఇంత తక్కువ నంబర్ ఎపుడూ వైసీపీ చూసిన దాఖలాలు లేవు. దాంతో ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ అయినా ఇటు వైసీపీ అయినా రెండూ కూడా ప్రాంతీయ పార్టీలుగానే ఉన్నాయి.
అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ ప్రజలకు ఎంతో చేశామని భావిస్తున్నాయి. ప్రజలకు ఎంతో మేలు చేసినా కూడా తాము ఎందుకు ఓటమి పాలు అయ్యామన్నది వారికి అర్థం కాకుండా ఉంది అని అంటున్నారు. దాంతో ఎందుకు ఓడిపోయాం అన్న దాని మీద కేసీఆర్ జగన్ ఇద్దరూ కలసి చర్చించుకుంటారని అంటున్నారు. లోతులకు వెళ్ళి అధ్యయనం చేస్తారు అని అంటున్నారు.
ఆ మీదట ఒక వర్క్ షాప్ ని కూడా పెట్టుకుని కీలకమైన అంశాల మీద చర్చించుకుంటారు అని అంటున్నారు. నిజానికి చూస్తే ఇద్దరూ ఒకే పడవలో ట్రావెల్ చేస్తున్నారు. ఇద్దరికీ ఏమీ పాలు పోని పరిస్థితి. ఇద్దరూ అటు ఎన్డీయే కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ లేరు. దాంతో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు రాజకీయ సుడిగుండాలు దాటుకుని ఒడ్డుకు చేరాలని చూస్తున్నారు.
దాంతో సాధ్యమైనంత తొందరలో కలుసుకుని జగన్ కేసీఆర్ భేటీ అవుతారు అన్నది గాసిప్స్ కింద పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకూ నిజం తెలియదు కానీ వన్ ప్లస్ వన్ ఎపుడూ బలమే. తెలంగాణాలో బీఆర్ఎస్ ఒంటరి అయిపోయింది. ఏపీలో వైసీపీ అంతకంటే ఒంటరిగా మిగిలింది. దాంతో ఓదార్చడానికి కూడా రెండో పార్టీ లేదు. ఈ పరిణామాల నేపధ్యంలో ఈ ఇద్దరు నేతలు కలుస్తారు తమకు తాముగా అన్నీ చెప్పుకుని స్వాంతన పొందుతారు అన్నది ఒక రకమైన పుకారు లాంటి ప్రచారంగా వినిపిస్తోంది. ఇందులో నిజమెంత ఉందో కాలమే చెప్పాల్సి ఉంది.