వ్యూహం మార్చిన జగన్....!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం ఉంది. గట్టిగా చెప్పాలంటే ఈ రోజుకు బిగిసి 54 రోజులు ఉంది
By: Tupaki Desk | 18 March 2024 3:30 PM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం ఉంది. గట్టిగా చెప్పాలంటే ఈ రోజుకు బిగిసి 54 రోజులు ఉంది. దాంతో ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారం చేయాలనుకున్న జగన్ తన వ్యూహాన్ని మార్చారు. అన్నీ ఆలోచించి తాపీగానే ప్రచారానికి ఆయన తెర లేపనున్నారు.
గతంలో అనుకున్నట్లుగా బహిరంగ సభలు రోడ్డు షోలు కాకుండా ఇపుడు ఆయన బస్సు యాత్రతో జనంలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఏపీలో ఇచ్చపురం నుంచి ఇడుపులపాయ దాకా వైఎస్ జగన్ బస్సు యాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు సాగనుంది అని తెలుస్తోంది. ఈ బస్సు యాత్రలో మొత్తం 120 దాకా అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తారు అని అంటున్నారు.
గతంలో అంటే 2017 టైం లో జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్రను చేశారు. ఆ విధంగా ఆయన అధికారాన్ని అందుకున్నారు. ఇపుడు ఆయన ఇచ్చాపురం నుంచి మొదలెట్టి ఇడుపులపాయకు చేరుకుంటారు అన్న మాట. ఈ బస్సు యాత్రకు మేమంతా సిద్ధం అని పేరు పెట్టారు. ఈ బస్సు యాత్రలో కీలకమైన నియోజకవర్గాలు అన్ని కవర్ చేయాలని నిర్ణయించారు.
ఈ బస్సు యాత్ర ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ మూడవ వారం నుంచి వివిధ నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలకు వైసీపీ ప్లాన్ చేసింది అని అంటున్నారు. బస్సు యాత్ర విషయంలో పార్టీ వ్యూహ రచన చేస్తోంది. అదే విధంగా ఈ లోగానే ఎన్నికల ప్రణాళికను రెడీ చేసుకుంటోంది.
బస్సు యాత్రలో వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రణాళికను ప్రజలకు మరింత చేరువ చేస్తారు అని అంటున్నారు. వైసీపీకి ఉన్న ఏకైక స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ జగన్ ఉన్నారు. ఆయన పార్టీ నుంచి మరొకరు ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశాలు లేవు అని అంటున్నారు.
గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ జగన్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. కానీ ఈసారి మాత్రం షర్మిల వేరే పార్టీలో ఉన్నారు. వైఎస్ విజయమ్మ అటు కుమారుడు ఇటు కుమార్తెల మధ్యన న్యూట్రల్ గా ఉండిపోతారు అని అంటున్నారు. ఆమె ఎటువైపు వెళ్లినా ఇబ్బంది కాబట్టి ఆమె తల్లిగా తటస్థమే అని చెబుతున్నారు.
వైఎస్ విజయమ్మ వైసీపీ తరఫున ప్రచారం చేస్తారు అని కూడా గతంలో ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఉత్తివే అని అంటున్నారు. ఆమె ఇపుడు రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగానే ఉంటున్నారు అని అంటున్నారు. ఆమె వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ వచ్చారు. అయితే 2022లో ఆమె ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్టీపీ అని తన కుమార్తె పెట్టిన పార్టీలోకి వెళ్లారు.
ఇపుడు ఆ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. దాంతో విజయమ్మ కాంగ్రెస్ లోకి వెళ్లలేదు. అలా ఆమె రాజకీయాలకు తాను దూరం అని చెప్పకనే చెప్పారు. మొత్తం మీద చూస్తే జగన్ మీదనే ఈసారి ఎన్నికల భారం మొత్తం పడనుంచి. మే 11 సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రచారం చేసుకోవచ్చు. దాంతో వైసీపీ ధీటైన ప్రచారాన్ని చేస్తుంది అని అంటున్నారు.