బిగ్ బ్రేకింగ్... జగన్ పై దాడి కేసులో నిందితుల అరెస్ట్!
"మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో ప్రయాణిస్తున్న సమయంలో సీఎం జగన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 April 2024 8:19 AM GMT"మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో ప్రయాణిస్తున్న సమయంలో సీఎం జగన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు జగన్ పై సతీష్ అనే వ్యక్తి దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో అతడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు చెబుతున్నారు.
అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడు సతీష్ ని అరెస్ట్ చేయడంతొ పాటు, అతడికి సహకరించిన దుర్గారావును అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు గత కొన్ని రోజులుగా నిందితులకోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరికొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ లను సేకరించే పనిలో ఉన్నారని అంటున్నారు.
ఈ సమయంలో... వీరిద్దరినీ మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో దుర్గారావు అనే వ్యక్తి.. దాడి చేసిన వ్యక్తిని ఇతర ప్రాంతానికి తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు! ఇదే సమయంలో వీరితో పాటు మరో ఐదుగురి పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని సమాచారం!
అయితే... ఈ మొత్తం వ్యవహారం ఒక బైక్ మెకానిక్ నుంచి తెలిసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే వడ్డెర కాలనీకి చెందిన సుమారు 25 మంది యువకులను పోలీసులు విచారించారని అంటున్నారు. ఇదే క్రమంలో... ఈ కేసులో రాజకీయం కోణంపై కూడా పోలీసులు క్షుణ్నంగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది. నిందితుల్లో దుర్గారావు అనే వ్యక్తిలో రాజకీయ కోణం కూడా ఉందని అంటున్నారు! దీంతో... ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయననేది ఆసక్తిగా మారింది!