పవన్ కి వంగా గీత కి తేడా చెప్పిన జగన్ !
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిద్ధం పేరిట సాగిన ఈ సభ అదరహో అన్నట్లుగానే జరిగింది
By: Tupaki Desk | 20 April 2024 3:41 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిద్ధం పేరిట సాగిన ఈ సభ అదరహో అన్నట్లుగానే జరిగింది. ఈ సభలో జగన్ పిఠాపురం ఓటర్లకు చేసిన వినతి ఆసక్తికరంగా ఉంది. అదేంటి అంటే తనకు తల్లి లాంటిది అక్క అయిన వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అని జగన్ చెప్పారు.
ఆమెని తప్పనిసరిగా గెలిపించాలని కోరారు. ఒక సినిమా హీరో రీల్ కి మాత్రమే పరిమితం అని పవన్ ని ఉద్దేశించి జగన్ కామెంట్స్ చేశారు. అదే రియల్ హీరో ఎవరైనా ఉన్నారూ అంటే అది వంగా గీత అన్నారు. ఆమెను గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటారని ఏ కష్టం వచ్చినా వెంటనే పలికే మనిషి అని జగన్ అన్నారు.
అదే పవన్ ని గెలిపిస్తే జ్వరం వచ్చిందని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయిన చందంగా వెళ్ళిపోతాడని ఆయన సెటైర్లు వేశారు. ఓట్లు వేయించుకున్నంత సేపే జనాలలో ఉంటారని ఆ తరువాత వారు అందుబాటులో ఉండరని జగన్ చెప్పారు.
వంగా గీత అయితే జనం మధ్యనే ఉండే నేత అని ఆమె అభివృద్ధి చేస్తారని, తాను కూడా దగ్గరుండి పిఠాపురం అభివృద్ధికి సహకరిస్తాను అని జగన్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కి రీల్ హీరో అని ఆయనని గెలిపించినా ఉపయోగం లేదని జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఇక పిఠాపురం ప్రజలు ఎపుడూ అందుబాటులో ఉండే అభ్యర్ధికే ఓటు వేస్తారు. గతంలో వర్మను వారు గెలిపించడం వెనక కూడా కులం చూసుకోలేదు. తమకు మేలు చేస్తారని మాత్రమే భావించి గెలిపించారు. అలా ఆలోచిస్తే కనుక కులాభిమానంతోనో మరో క్రేజ్ మోజుతోనో పిఠాపురం ఓటర్లు ఓట్లు వేస్తారు అని ఎవరూ అనుకోవడం లేదు. వారు వివేకంతో ఆలోచిస్తారు అనే అంటున్నారు.
సరిగ్గా ఇదే పాయింట్ మీద జగన్ కూడా చెబుతూ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గీత అని నొక్కి మరీ చెప్పారు. దీనిని బట్టి చూస్తే కనుక పిఠాపురం ప్రజల మనసెరిగి మరీ జగన్ ఈ విజ్ఞప్తి చేశారు అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో గీతను తన తల్లిగా సోదరిగా ఆయన పరిచయం చేయడం ద్వారా పిఠాపురం ప్రజల మనసుని దోచుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.