వరద ప్రాంతాల్లో సీఎం జగన్ టూర్ లేట్ ఎందుకు.. క్లారిటీ ఇదే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు వరద ప్రభావ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించలేదన్న విమర్శల తీవ్రత ఎక్కువైంది
By: Tupaki Desk | 4 Aug 2023 5:25 AM GMTవిపత్తు విరుచుకుపడిన వేళ.. బాధితుల విషయంలో అనుసరించాల్సింది ఏమిటి? వారికి తక్షణ సాయం అందేలా చేయటం.. వారికి జరిగిన నష్టానికి పరిహారం అందేలా చూడటం. అంతే తప్పించి ఫోటోలు.. వీడియోల కోసం పరామర్శల పర్వం చేపడితే జరిగే నష్టం.. సహాయక చర్యలు ఆలస్యంగా సాగటం. ఈ విషయాన్ని గుర్తించకుండా.. పరామర్శల ద్వారా మైలేజీకి పడే ప్రయాస అంతా ఇంతా కాదు. ఇటీవల కురిసిన వర్షాలతో చోటు చేసుకున్న వరదలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అయితే.. వరద బాధితులకు సాయం అందించే విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు వరద ప్రభావ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించలేదన్న విమర్శల తీవ్రత ఎక్కువైంది. అయితే.. వీటిపై సీఎం స్పందించారు. తాజాగా వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తన విజన్ ను ఆవిష్కరించారు.
వరద ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా సాగాలన్న ఆయన.. తాను ఆయా ప్రాంతాల్లో పర్యటించకపోవటానికి కారణం.. తాను వచ్చిన కారణంగా బాధితులకు అందాల్సిన సాయం సకాలంలో అందకపోయే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతోనే తాను ఆలస్యంగా వస్తున్నట్లు పేర్కొన్నారు. విపత్తుల వేళ బాధితులను ఆదుకునేందుకు అవసరమైన నిధులు.. వనరుల్ని అధికారులకు ముందుగానే సమకూర్చామని.. అప్రమత్తంగా వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
వరద సాయం విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి జగన్.. ''మనకే ఆ పరిస్థితి ఎదురైతే ఎలాంటి సాయాన్ని ఆశిస్తామో.. బాధితులకు ఇచ్చే సాయం కూడా అలానే ఉండాలి'' అని చెప్పుకొచ్చారు. వరద ప్రభావం తగ్గిన వెంటనే ఆస్తి.. పంట నష్టాల వివరాల్ని సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు వేగంగా సాగాలన్న ముఖ్యమంత్రి.. వరద ప్రభావం తగ్గానే తాను వస్తానని.. అన్ని విషయాల్ని పరిశీలిస్తానని చెప్పారు. తాను టూర్ కు వస్తే.. బాధితులకు సహాయక చర్యలు ఆలస్యం అవుతాయన్న ఉద్దేశంతోనే తాను లేట్ గా వస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. నిజమే.. వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శ కంటే కూడా వారికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీఎం జగన్ అదే చేస్తున్నారని చెప్పాలి.