జగన్ మీద కేసీయార్ సంచలన కామెంట్స్!
ఇదిలా ఉంటే జగన్ సీఎం అయిన కొత్తల్లో తరచూ కేసీయార్ జగన్ మీట్ అవుతూ ఉండేవారు
By: Tupaki Desk | 7 Aug 2023 4:46 AM GMTజగన్ ఏపీ సీఎం. కేసీయార్ తెలంగాణా సీఎం. ఇద్దరి మధ్యన మంచి అనుబంధం ఉంది అని అంటూంటారు. ఏపీలో జగన్ సీఎం కావడానికి కేసీఆర్ 2019 ఎన్నికల ముందు తెర వెనక చాలానే సాయం చేసారు అని ప్రచారంలో ఉన్న మాట. అంతే కాదు జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి కేసీయార్ స్వయంగా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే జగన్ సీఎం అయిన కొత్తల్లో తరచూ కేసీయార్ జగన్ మీట్ అవుతూ ఉండేవారు. ఆ తరువాత అది తగ్గింది. ఇక ఏపీలో జగన్ అయినా తెలంగాణాలో కేసీయార్ అయినా ఒకరిని ఒకరు విమర్శించుకున్న దాఖలాలు అయితే లేవు. అలా ఇప్పటికీ ఏదో ఒక బంధం కొనసాగుతోందని అందరూ అంటూంటారు.
దానికి సరైన ఉదాహరణ అన్నట్లుగా నిండు తెలంగాణా అసెంబ్లీలో కేసీయార్ జగన్ మీద సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ జగన్ని కేసీయార్ పొగిడారు. వైఎస్సార్ మరణించాక కాంగ్రెస్ పార్టీ జగన్ని నానా బాధలు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని కేసీయార్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు.
ఒక విధంగా జగన్ని ర్యాంగ్ హ్యాండిల్ చేసిందని విమర్శించారు. దాంతో జగన్ సొంతంగా పార్టీని పెట్టుకున్నారని ఆయన కడప లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో అయిదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు అని కేసీయార్ నిండు సభలో ప్రస్తావించడం విశేషం. ఆ మీదట జగన్ ఎన్నికల్లో స్వీప్ చేసి పారేశారని, దాంతో ఆంధ్రాలో కాంగ్రెస్ పని అయిపోయిందని అన్నారు.
ఇలా జగన్ని పొగుడుతూ కాంగ్రెస్ ని విమర్శిస్తూ కేసీయార్ చేసిన ఈ ప్రసంగం ఇపుడు వైరల్ అవుతోంది. అయితే కేసీయర్ రాజకీయ చాణక్యుడు ఆయన ఊరకే ఈ మాటలు అనలేదని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పని 2014 ఎన్నికల నాటికే ఖతం అయినా తెలంగాణాలో మాత్రం ఇంకా ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో బీయారెస్ కి కాంగ్రెస్ నుంచే గట్టి పోటీ ఎదురవచ్చు అని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పని ఖతం తెలంగాణాలో కూడా కావాలన్న ఆలోచనతోనే కేసీయార్ ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. అంతే కాదు ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో వైఎస్సార్ జగన్ లను తలచుకోవడం వెనక బలమైన రెడ్డి ఓటు బ్యాంక్ ని తన వైపునకు తిప్పుకునే యోచనతో చేశారు అని కూడా అంటున్నారు.
మరో వైపు చూస్తే నిన్నటికి నిన్న కేటీయార్ కూడా జగన్ ప్రస్తావనను సభలో తెచ్చారు. జగన్ కి థాంక్స్ కూడా చెప్పారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడానికే వైఎస్సార్ కుటుంబాన్ని ఆ పార్టీ తీరని అవమానాలకు గురి చేసింది అని ఫ్లాష్ బ్యాక్ ని కేసీయార్ చెప్పారని అంటున్నారు.
వైసీపీ ఫ్యాన్స్ కూడా తెలంగాణాలో ఉన్నారు వారిని ఆకట్టుకోవడం కోసమే ఇదంతా అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే కేసీయార్ జగన్ మీద ప్రశంసలు కురిపిస్తూ కాంగ్రెస్ తీరుని ఎండగట్టడం చర్చనీయాంశం అవుతోంది.