బాబుకు సీఎం కుర్చీ ఎందుకు ఇవ్వాలీ...జగన్ స్ట్రైట్ క్వశ్చన్
చంద్రబాబుకు సీఎం కుర్చీ ఎందుకు ఇవ్వాలీ. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ వేసిన ప్రశ్న ఇది
By: Tupaki Desk | 11 Aug 2023 8:55 AM GMTచంద్రబాబుకు సీఎం కుర్చీ ఎందుకు ఇవ్వాలీ. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ వేసిన ప్రశ్న ఇది. ఇది ఆషామాషీగా వేసిన ప్రశ్న కాదు, బాబు హిస్టరీని సీఎం గా ఆయన పనిచేసిన అనుభవాన్ని ఆయన పాలనలో డొల్లతనాన్ని ఏకరువు పెడుతూ మళ్లీ నాలుగవసారి సీఎం కుర్చీ బాబుకు ఎందుకు ఇవ్వాలంటూ అయిదు కోట్ల ప్రజలనే అడిగారు.
బాబు తొలిసారి సీఎం అయింది 1995లో. అంటే ఇప్పటికి 28 ఏళ్ల ముందు. ఆ తరువాత ఆయన ముమ్మారు సీఎం అయ్యారు. పద్నాలుగేళ్ల పాటు పాలించారు. ఈ సుదీర్ఘ కాలంలో బాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పధకం ఏదైనా ఉందా అని జగన్ నిగ్గదీశారు. పేదలకు తాను ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాను, బాబు ఒక్క పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.
2014 తరువాత చంద్రబాబు సీఎం అయ్యారు, అప్పటికి ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని జగన్ అడిగారు. చంద్రబాబు ఉన్నపుడు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్. అప్పులు కూడా తన కంటే ఎక్కువే చేశారు. అయినా ప్రజలకు తాను గత నాలుగేళ్ళలో ఇచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల డైరెక్ట్ నగదు బదిలీ పధకాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారని జగన్ సూటిగానే అడిగారు.
నాడు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేయాలని అన్నారు. చంద్రబాబుకు ఎస్సీస్, , ఎస్టీ, బీసీలు అంటే ప్రేమాభిమానాలు లేవని, డ్వాక్రా మహిళలను కూడా హామీలు ఇచ్చి వంచించారని, రైతులకు రుణ మాఫీ అని చెప్పి వారికీ టోకరా పెట్టారని జగన్ నిందించారు. మాటకు విలువ ఇవ్వని చంద్రబాబు ముఖ్యమంత్రిగా మళ్లీ అవసరమా అని జగన్ అంటున్నారు.
చంద్రబాబు సీఎం అయితే ప్రజలకు పేదలకు ఏమి ఒరుగుతుంది, ఎవరికి లాభం అని ఆయన అంటున్నారు. ఆయన అనుకూల మీడియా దత్తపుత్రుడుకే లాభం తప్ప ప్రజలకు ఏ మేలూ చేయని బాబు సీఎం గా ఎందుకు కుర్చీ ఎక్కాలని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయం ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు.
పవన్ గురించి కూడా జగన్ అమలాపురం సభలో గట్టిగానే విమర్శించారు. తాను సీఎం కావడానికి దత్తపుత్రుడు ప్రయత్నం చేయడం లేదని చంద్రబాబు సీఎం కావడం కోసం పరుగులు పెడుతున్నారని సెటైర్లు వేశారు. వీరంతా ప్రతీ రోజూ మూడేసి ప్రాంతాలలో మీటింగ్స్ పెట్టి ప్రజలకు మంచి చేస్తామని చెప్పడం లేదని, తాము అధికారంలోకి వస్తే అందరి అంతూ చూస్తామని కక్ష తీర్చుకుంటామని అంటున్నారని జగన్ ఫైర్ అయ్యారు.
ఇలా ఎక్కడైనా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అరాచకాలు చేయడానికి సిద్ధపడుతున్న ప్రతిపక్ష నేతలకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏడున్నర పదుల వయసు ఉన్న చంద్రబాబు పుంగనూరులో చేసిన అరాచకాన్ని చూస్తే బాధ వేసిందని అన్నారు. బాబు తన రూట్ మార్చి మరీ వెళ్ళి నలభై మంది పోలీసులకు గాయాలు అయ్యేలా చేసారని, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోగొట్టారని అన్నారు. ఇలాంటి అరాచకాలను ముందు ముందు ఇంకా చేయడానికే చూస్తున్నారు, ప్రజలను రెచ్చగొడుతూ శవ రాజకీయాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
తాను ప్రతీ ఇంటికీ మంచి చేశాను అని అనిపిస్తేనే ఓటు వేయాలని, తనకు ఒక బలమైన సైన్యంగా నిలబడాలని జగన్ కోరారు. ఇదిలా ఉంటే అమలాపురం సభలో చంద్రబాబుకు మళ్ళీ సీఎం పదవి ఎందుకు ఇవ్వాలంటూ జగన్ లేవనెత్తిన కొత్త పాయింట్ రాజకీయంగా వైసీపీ పదునెక్కిన వ్యూహానికి నిదర్శనం అంటున్నారు. బాబు సీఎం గా పనిచేసారని, ఆయన నిర్వాకం అంతా చూసారని, ఇక ఆయనకు ఏ పదవీ వద్దు చాలు అన్నదే జగన్ నినాదంగా మార్చుకోబోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి జనాలను ఆలోచన చేయమంటున్న జగన్ మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటారో.