ఏపీ సీఎం జగన్‌పై 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీవ్ర ఒత్తిడి!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి సేవల విషయంలో తనదైన శైలిలో ముద్ర వేసే ఆలయ పాలక మండలిలో సభ్యత్వం కోసమే ఈ పాట్లన్నీ
By: Tupaki Desk | 17 Aug 2023 5:34 AM GMT''సీఎంగారూ.. మమ్మల్ని గుర్తు పెట్టుకోండి సార్.. మా రాష్ట్రంలో శ్రీవారి ఆలయానికి 50 ఎకరాల భూమిని ఎలాట్ చేశాం. కొంచెం మా వోడికి బోర్డులో సీటు ఇప్పించండి''- కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫోన్
''మావోళ్లను బోర్డులో పెట్టుకోవాల్సిందే. తిరుమల విషయంలో మాకు కూడా కంట్రిబ్యూషన్ ఉంది'' తమిళనాడు నుంచి ఏకంగా సీఎం స్టాలిన్ సందేశం. ఇలా.. సీఎం జగన్ పేషీకి నిత్యం అనేక ఫోన్లు వస్తున్నాయి. దీనికి కారణం.. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డును పునర్ వ్యవస్థీకరిస్తుండడమే.
రాజకీయాల్లో ఉన్నవారికి ఒత్తిళ్లు సహజమే. ఇక, అధికారంలో ఉన్నవారిపై మరింత ఒత్తిడి ఉంటుంది. అయితే.. ఏకంగా ఏపీ సీఎం జగన్ పైనే తీవ్ర ఒత్తిడి పడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది ముఖ్యమంత్రులు, మరో ఇద్దరు పారిశ్రామిక వేత్తలు, మరో ఇద్దరు ప్రముఖ కాంట్రాక్టర్లు, ఒక ఆంగ్ల పత్రిక ఎడిటర్ సహా కేంద్ర సహాయ మంత్రి నుంచి సీఎం పేషీకి ఫోన్లు వస్తున్నాయి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి సేవల విషయంలో తనదైన శైలిలో ముద్ర వేసే ఆలయపా లక మండలిలో సభ్యత్వం కోసమే ఈ పాట్లన్నీ. లిప్తకాలం పాటు సప్తగిరీశుని దర్శనం దక్కడమే మహా పుణ్యమని భావించే భక్త శిఖామణికి ఏర్పాటు చేసేందుకు.. తిరుమలరూపు రేఖలు మార్చే నిర్ణయాలు తీసుకోవడంలోనూ పాలక మండలికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డులో చైర్మన్ పదవి నుంచి సభ్యుల వరకు ఎంతో డిమాండ్ నెలకొంది.వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ప్రస్తుతం ఏర్పడుతున్నది మూడో టీటీడీ బోర్డు. తొలి రెండుసార్లు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. ఇక, తాజాగా ఆయన పదవీ కాలం ముగియడంతో(ప్రతి రెండేళ్లకు బోర్డు మారుతుంది) ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇక, ఇప్పుడు బోర్డు సభ్యులను నియమించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ బోర్డులో తమ వారికి అవకాశం ఇవ్వాలంటూ.. పైవిధంగా ముఖ్యమంత్రులు, మంత్రుల నుంచి ఒత్తిడి ఉండడం గమనార్హం. బోర్డులో 2 రకాల సభ్యులు ఉంటారు. ఒకటి సాధారణ సభ్యులు, రెండు ఎక్స్ అఫిషియో సభ్యులు. వీరిని ప్రభుత్వమే సీఎం నిర్ణయంతో ఏర్పాటు చేస్తుంది. వాస్తవానికి 30-31 మంది సభ్యులకు అవకాశం ఉంది. అయితే.. తొలి బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఏకంగా వీరి సంఖ్య 55కు పెంచారు. అయితే.. దీనిని హైకోర్టు కొట్టి వేసి.. 31కే కుదించడం గమనార్హం.