జగన్ కి మౌనమే ఆయుధమా....ఆ ఇద్దరూ అలా...?
ఇక వేలాది మంది జనాలు వచ్చిన బహిరంగ సభలలో సైతం క్లుప్తంగా మాట్లాడి ముగిస్తారు
By: Tupaki Desk | 19 Aug 2023 4:00 AM GMTజగన్ మౌన మునిగా ఉంటారు. రాజకీయాల్లో అందునా పూర్తి స్థాయి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏ ఒక్క మాట మాట్లాడినా అది శిలాక్షరం అవుతుంది. రికార్డు అయిపోతుంది. ఆ తరువాత మాట వెనక్కి తీసుకునేందుకు కూడా ఉండదు. రాజకీయ నాయకులకు మాటే మంత్రం. అదే వారికి జనాలకు చేరువ చేస్తుంది. కానీ అదే మాట తూలితే జనాలకు దూరం చేస్తుంది కూడా. అందువల్ల ఏ మాట అయినా ఆచీ తూచీ మాట్లాడాల్సి ఉంటుంది.
ఇక్కడ చూసుకుంటే ఒక్కో రాజకీయ నాయకుడికి ఒక్కో తీరుగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్ చాలా తక్కువగా మాట్లాడుతారు. ఆయన విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే తీరు. ఇక వేలాది మంది జనాలు వచ్చిన బహిరంగ సభలలో సైతం క్లుప్తంగా మాట్లాడి ముగిస్తారు. ఇది జగన్ వ్యవహార శైలి అని అంటారు.
దీని వల్ల ప్లస్ ఏంటి అంటే ఇంకా మాట్లాడాలి అని అనుకుంటూండగా ముగించడం. ఇది నాయకుడి క్రేజ్ ని అలాగే ఉంచుతుంది. తప్పులు ఎక్కువగా దొర్లకుండా ఉంటాయి. ఈ డిజిటల్ యుగంలో రికార్డు అంతా అవుతుంది కాబట్టి ఎక్కడా తప్పులకు అవకాశం పెద్దగా ఇవ్వకుండా చూసుకోవచ్చు. అదే సమయంలో చెప్పాలనుకున్నది సూటిగా చెబితే అదే జనం మెదళ్ళలోకి వెళ్తుంది. ఎక్కువ మాట్లాడితే అనవసర విషయాలకు అటు జనాలు ఇటు మీడియా ప్రాధాన్యత ఇస్తే అనుకున్నది ప్రజలకు పోదు.
ఇదే రకమైన థియరీని జగన్ ఫాలో అవుతున్నారు. అయితే తక్కువగా కనిపించడం తక్కువగా మాట్లాడడం రాజకీయాల్లో అందునా ఈ రోజులలో మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనే వారూ లేకపోలేదు. నిత్యం మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట నలుగుతూ ఉండాలని అనేవారూ ఉన్నారు. అయితే వర్క్ మాట్లాడాలి తప్ప మనం కాదు అనుకున్నపుడు అది కూడా మైనస్ ని కవర్ చేస్తుంది. అలా వైసీపీ అధినేత ఒక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
ఇక చంద్రబాబు తీరు అందరికీ తెలిసిందే ఆయన పబ్లిక్ మీటింగ్ అయినా పార్టీ మీటింగ్ అయినా మీడియా మీటింగ్ అయినా లేక అసెంబ్లీ అయినా ఎక్కడ అయినా గంటల కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. అందుకో స్టఫ్ తో పాటు అనవసర మ్యాటర్స్ కూడా జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయని అంటారు. ఇక బాబు స్పీచ్ లో ఎక్కువ సేపు తన గురించి చెప్పుకోవడం అదే సమయంలో ప్రత్యర్ధిని విమర్శించడం కనిపిస్తుంది. ఆయన ప్రస్తుతం జగన్ని ప్రతీ రోజూ ఏదో వేదిక మీద విమర్శిస్తూనే ఉన్నారు.
సైకో అంటున్నారు. చేతగాని సీఎం అంటున్నారు. మన ఖర్మ అంటున్నారు. విద్వంశకారుడు అంటున్నారు. జగన్ దిగి పోవాల్సిందే అని పిలుపు ఇస్తున్నారు. అయితే ఎంత అయినా తన గురించి చెప్పుకోవచ్చు కానీ ప్రత్యర్ధిని పట్టుకుని విమర్శలు చేయడం దారుణంగా తిట్టడం వల్ల అది ప్లస్ కంటే మైనస్ ఎక్కువగా చేసే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఇక ఉదాహరణకు గోదావరి జిల్లాలో చంద్రబాబు శుక్రవారం ఒక ముఖాముఖీలో పాల్గొన్నారు.
అక్కడ ఒక విద్యాధికుడు ఒక ప్రశ్న వేశారు. యువత బలహీనతతో ఆత్మహత్యలు చేసుకుంటోంది దానికి పరిష్కారాలు చూడాలని ఆయన అడిగితే చంద్రబాబు జవాబు ఏమి ఇచ్చారు అంటే జగన్ దే తప్పు అని, జగన్ లాంటి సీఎం ఉండడం వల్లనే ఇలా జరుగుతోందని, నిజానికి ప్రశ్న వేరు, జవాబు వేరు అని అంటున్నారు. యువత సెల్ ఫోన్లకు ఇతర వాటికి వ్యసనపరులు అవుతున్నారని, మానసికంగా బలహీనంగా ఉన్నారని అడితే జగన్ పేరు తెచ్చి బాబు విమర్శలు చేశారు. ఇలా అయిన దానికీ కాని దానికీ జగన్ మీద విమర్శలు చేయడం వల్ల జగన్ కే సానుభూతి తెస్తున్నారని అంటున్నారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ విషయంలో పరుషంగా మాట్లాడడం తీవ్ర విమర్శలు చేయడం వంటివి ప్రజలలో ఆలోచనలు పెంచుతున్నాయని అంటున్నారు. జగన్ని పట్టుకుని క్రిమినల్ అని ఫ్రాక్షనిస్టు అని పదే పదే పవన్ అనడం ద్వారా జగన్ మీద లేని పోని సింపతీ పెంచుతున్నారు అని అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే జగన్ పెద్దగా విపక్షాల గురించి మాట్లాడరు, ఆయన తన స్పీచ్ లో చివరి పది నిముషాలు మాత్రమే విమర్శలకు కేటాయిస్తారు.
ఆ సమయంలో ఆయన సెటైర్లు ఒకటి రెండు పేలుస్తారు. ఇక పవన్ విషయంలో దత్తపుత్రుడు అని ఊరుకుంటున్నారు. కానీ బాబు కానీ పవన్ కానీ లోకేష్ కానీ జగన్నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో జగన్ ఏమీ అనకుండానే ఇన్ని మాటలు తింటున్నారు అన్న సానుభూతి అయితే వచ్చేస్తోంది. ఒక విధంగా ఆయన మౌనమే ఒక వ్యూహంగా మారిందా వరంగా అవుతోందా అంటే అవును అనే అంటున్నారు.