మినిస్టర్ రోజా ఇలాకాలో జగన్... గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా...?
ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నగరిలో జగనన్న విద్యాదీవెన పధకానికి బటన్ నొక్కుతారు
By: Tupaki Desk | 19 Aug 2023 6:45 PM GMTవైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే మినిస్టర్ ఆర్కే రోజా పేరుని ముందు చెబుతారు. ఆమె మీడియా ముందుకు వచ్చిందంటే చాలు విపక్షాలకు గట్టిగానే క్లాస్ తీసుకుంటారు. హాట్ కామెంట్స్ చేస్తారు. ఆమె విమర్శల జడివానకు ఎవరూ గుక్క తిప్పుకోలేరు. రోజా రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైనది. ఆమె 2004, 2009లలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు. 2014, 2019లలో వైసీపీ నుంచి గెలిచారు. అయితే ఈ రెండు గెలుపులూ ఆమెకు చెప్పుకోదగినవి కావు.
ఒకసారి కేవలం వేయి ఓట్ల లోపు గెలిస్తే మరోసారి అంటే జగన్ వేవ్ బలంగా ఉన్నా కూడా జస్ట్ రెండు వేల ఓట్ల తేడాతోనే గెలిచారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఆమెకు 2024లో జగన్ టికెట్ ఇస్తారా అన్న డౌట్ ఉంటూ వచ్చింది. అయితే జగనే స్వయంగా నగరి టూర్ చేయబోతున్నారు అన్నది ఇపుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం.
ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నగరిలో జగనన్న విద్యాదీవెన పధకానికి బటన్ నొక్కుతారు. నగరి నుంచి ఆయన ప్రసంగిస్తారు. అంటే ఆయన ఒక విధంగా రోజా టికెట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేక టెస్ట్ పెడుతున్నారా అన్న చర్చ అయితే వైసీపీలో మొదలైంది. ఎందుకంటే రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో వ్యతిరేక వర్గాలు బలంగా పనిచేస్తున్నాయి. ఆమెకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని ఆ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి.
అదే టైంలో జనసేన టీడీపీ ఇక్కడ బలపడ్డాయి. ఒక వేళ పొత్తులు కనుక ఉంటే నగరిలో రోజాకు ఇబ్బందే అంటున్నారు. అయితే మినిస్టర్ గా ఉన్న రోజాకు జగన్ టికెట్ నిరాకరిస్తారా లేక టెస్ట్ పెట్టి ఆమెకు నగరిలో ఉన్న బలం చూసి టికెట్ ఇస్తారా అన్నది ఇపుడు పార్టీలో చర్చించుకుంటున్నారు. ఇక రోజా సొంత నియోజకవర్గం నగరికి జగన్ స్వయంగా వస్తున్నారు అంటే అక్కడ వైసీపీ పట్టు పెంచేందుకు రోజాకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను కూడా చేరదీసి ఆమెకు మద్దతు ఇవ్వమని చెప్పేందుకు అని కూడా అంటున్నారు.
ఒక విధంగా పార్టీ పరిస్థితిని కూడా జగన్ స్వయంగా చూసి చక్కదిద్దుతారు అని అంటున్నారు. అలా రోజా గెలుపునకు బాటలు వేసే ఉద్దేశ్యంతోనే నగరిలో సీఎం టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు రోజా కూడా లైట్ తీసుకోవడంలేదు. సీఎం జగన్ నగరిలో మీటింగ్ అంటే తన బలాన్ని మొత్తం చూపించాలని ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు అని అంటున్నారు. నగరిలో తనదే గెలుపు అని వైసీపీలో వ్యతిరేకవర్గం అంటూ పెద్దగా లేదని, ఉన్నందంతా తన అనుకూల వర్గమే అని చాటి చెప్పడానికి రోజా చూస్తున్నారు అని అంటున్నారు.
అయితే రోజా ఈ సభను సక్సెస్ చేయాలని చూస్తుండగా వ్యతిరేక వర్గం సహకరించకూడదని నిర్ణయించింది అని వార్తలు వస్తున్నాయి. నగరిలో రోజా ప్రభావం పెద్దగా లేదని చాటి చెప్పడమే ఆమె వ్యతిరేక వర్గం ఉద్దేశ్యం అని అంటునారు. అయితే ఎవరేమి చెప్పినా ఏమి చేసినా జగన్ నిర్ణయమే ఫైనల్. జగన్ ఒకసారి నిర్ణయించుకుంటే మాత్రం వారికే టికెట్ ఇస్తారు.
నగరిలో రోజాకు జగన్ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న మీదటనే అక్కడ ఆయన పర్యటిస్తున్నారు అని అంటున్నారు. దాంతో హ్యాట్రిక్ విజయం రోజాకు దక్కుతుందా. వ్యతిరేక వర్గం పార్టీ పెద్దల మాట విని సహకరిస్తుందా, టీడీపీ జనసేన పొత్తుల ప్రభావం ఉంటుందా ఉండదా ఇవన్నీ సందేహాలుగానే ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో. జగనన్న నగరిలో టూర్ అంటే ఒక విధంగా అది హాట్ టాపిక్ గానే ఉంది మరి.