బెజవాడలోని ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ కు జగన్ ఎందుకు వెళ్లారు?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు
By: Tupaki Desk | 22 Aug 2023 6:09 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ హుషారుగా ఉండే ఆయన.. తాజాగా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కు వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఆయన ఆ ల్యాబ్ కు వెళ్లింది.. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకుండా.. ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లటంతో.. అసలేం జరిగిందన్నది ప్రశ్నగా మారింది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వేళలో.. విజయవాడలోని మొగల్రాజపురంలోని ఒక ప్రముఖ డయాగ్నోస్టిక్ ల్యాబ్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ల్యాబ్ లోనే దాదాపు రెండు గంటల పాటు ఉన్నారు. ఇంతసేపు ఒక ల్యాబ్ లో ఎందుకు ఉన్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతగ్గా.. ఆరోగ్య పరీక్షలు చేసుకున్నట్లుగా వెల్లడైంది.
అయితే.. రోటీన్ పరీక్షలతో పాటు.. కొద్ది రోజులుగా కాలు మడమ నొప్పితో ఇబ్బంది పడుతున్న వేళ.. దానికి సంబంధించిన పరీక్షలు.. బ్లడ్ టెస్టులతో పాటు.. ఎంఆర్ఐ స్కాన్ లాంటి పరీక్షలు చేయించుకొని.. రిపోర్టులు తీసుకొని వెళ్లినట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్ కు పరీక్షలు నిర్వహించే వేళలో.. జగన్ సతీమణి భారతి ఆయన వెంటే ఉన్నారు.
కాకుంటే.. రెండు గంటల పాటు పరీక్షలు జరగటంతో అసలేమైందన్న ప్రశ్న తలెత్తింది. రిపోర్టులు దాదాపుగా నార్మల్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాలి మడమకు సంబంధించిన లోపాన్ని గుర్తించారని చెబుతున్నారు. పరీక్షల అనంతరం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిపోయారు.