ఫోకస్ విజయనగరం...జగన్ సెట్ చేసేస్తారా...?
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది
By: Tupaki Desk | 24 Aug 2023 4:11 AM GMTవైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఉత్తరాంధ్రా మొత్తం మీద వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లా ఇదే. రాయలసీమలో కడప, కర్నూల్, అలాగే దక్షిణ కోస్తాలో నెల్లూరు వైసీపీకి మరో రెండు క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు.
ఇక కోస్తా అంతా చూసుకుంటే విజయనగరంలో 2019 ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. మరో మారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని వైసీపీ అనుకుంటోంది. దాని కోసం వైసీపీ అధినాయకత్వం చురుకుగా పావులు కదుపుతోంది.
విజయనగరం జిల్లాలో టీడీపీలో అత్యంత సీనియర్లు, అలాగే జూనియర్లు ఉన్నారు. వీరి మధ్య గ్యాప్ ఉంది. దాంతో పాటు వర్గ పోరు ఉంది. 2014 తరువాత చూస్తే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట టీడీపీలో పెద్దగా చెల్లడంలేదు అని అంటున్నారు. ఆయన లోక్ సభకు పోటీ చేసి కేంద్ర మంత్రి కావడంతో జిల్లా రాజకీయాల్లో పట్టు సడలింది.
అదే టైం లో బొబ్బిలి రాజులను వైసీపీ నుంచి తెచ్చి టీడీపీలో కలుపుకున్నా మొత్తం జిల్లాను కమాండ్ చేసే పరిస్థితి అయితే వారి నుంచి లేకుండా పోయింది. ఇక మాజీ మంత్రి కళా వెంకటరావు ఫ్యామిలీకి చెందిన కిమిడి నాగార్జునను జిల్లా ప్రెసిడెంట్ చేసి యంగర్ జనరేషన్ ప్లస్ బీసీలకు పగ్గాలు ఇచ్చామని అనిపించుకున్నా టీడీపీకి ఆ వైపుగా కూడా పెద్దగా ఆశలు కనిపించడంలేదు.
దాంతో అశోక్ నాయకత్వంలో ఒకనాడు ఏకచత్రాధిపత్యంగా ఊన్న జిల్లా టీడీపీ ఇపుడు ఇబ్బందులు పడుతోంది. సరిగ్గా ఈ పరిణామాలే బాగా కలసివస్తాయని వైసీపీ భావిస్తోంది. వైసీపీలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కూడా జిల్లా పగ్గాలను అందుకున్నారు. ఈ ఇద్దరు సారధ్యంలో వైసీపీ మళ్లీ క్లీన్ స్వీప్ చేసేలా అధినాయకత్వం మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
ఈ నెల 25న జిల్లాకు వస్తున్న జగన్ కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా రాజకీయాల మీద ఫోకస్ పెట్టనున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు అని తెలుస్తోంది. పార్టీని మళ్లీ విజయపధంలో నడిపించాలని కీలకమైన సూచనలు జగన్ ఇస్తారని అంటున్నారు. జిల్లాలో రానున్న ఎన్నికలకు సంబంధించి సగానికి సగం మంది అభ్యర్ధుల ఎంపిక కూడా పూర్తి అయింది అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో పూర్తి స్థాయిలో అభ్యర్ధులను ఎంపిక చేయడం ద్వారా జిల్లా పార్టీని ఎన్నికల రంగంలోకి నడపాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.