పదవుల గంపతో జగన్...ఆ తరువాతనే టికెట్లు...?
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు
By: Tupaki Desk | 25 Aug 2023 11:30 PM GMTవైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. పార్టీ పదవులను భర్తీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఏపీలో మొత్తం 26 జిల్లాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను ప్రకటించారు. ఆ తరువాత రాష్ట్ర స్థాయి కార్యవర్గాలు పదవులు కూడా ప్రకటిస్తారు అని తెలుస్తోంది.
ఈ రెండూ ముగిసిన తరువాత నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీలో చాలా కీలకమైన పదవులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులతో పాటు రెండేళ్ళ కాలపరిమితితో క్యాబినేట్ ర్యాంక్ పదవులు అనేకం ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం ద్వారా పార్టీలో ఆశావహుల సంఖ్యను బాగా తగ్గించాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.
వైసీపీలో ఇపుడు టికెట్ల కోసం భర్తీ ఎత్తున పోటీ ఉంది. ఒక్కో నియోజకవర్గంలో కనీసంగా ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. వీరికి పదవులు ఇవ్వడం ద్వారా పోటీ నుంచి చాలా మందిని పక్కన పెట్టాలన్నది స్ట్రాటజీగా ఉంది. ముందు పార్టీ పదవులు ఆ మీదట ప్రభుత్వ పదవులు ఇచ్చాక అపుడు టికెట్ల కసరత్తు సాగుతుంది అని అంటున్నారు.
ఆ విధంగా చూస్తే ఎన్నికల్లో టికెట్లు వచ్చే వారెవరో కూడా చూచాయగా తేలిపోతుంది అని అంటున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు అందుకున్న వారికి గట్టి భరోసా ఇచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయమని చెప్పాలన్నదే జగన్ మార్క్ ఆలోచనగా ఉందని అంటున్నారు.
అలా పదవులు అందుకున్న వారు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే 2024 లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వారికి మరింత ఎక్కువగా ప్రాధాన్యత గౌరవం దక్కుతాయని చెబుతారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ కూడా బీయారెస్ అధినేత కేసీయార్ ఫార్ములానే అనుసరిస్తోంది అని అంటున్నారు. సిట్టింగులకే తొంబై శాతం దాకా మళ్లీ టికెట్లు ఇస్తారని ప్రచారం సాగుతోంది
ఆ విధంగా చేయడం ద్వారా విపక్షాల వైపు జంపింగ్స్ పెద్ద ఎత్తున వెళ్లకుండా చూసుకోవాలని అనుకుంటోంది. అదే విధంగా పార్టీలో ఉన్న ఆశావహులకు కూడా ముందే పదవులు కట్టబెట్టడం ద్వారా వారిని కూడా తమ వైపునకు తిప్పుకుని ఎవరూ పర్టీ లైన్ దాటకుండా చేజారిపోకుండా చూడాలన్నదే వైసీపీ ఎత్తుగడ అని అంటున్నారు.
ఇక నామినేటెడ్ పదవులు అందుకున్న వారు అయితే టికెట్ల రేసులో ఉంటారా ఉండరా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంకో వైపు చూస్తే స్మూత్ గా సాఫీగా టికెట్ల ప్రక్రియ సాగేందుకు దానికంటే ముందుగా పదవుల పందేరాన్ని ప్రారంభిస్తున్నారు అని అంటున్నారు.
ఇక పదవుల పంపిణీలో సైతం సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు అని అంటున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు అక్కడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. పార్టీ పదవులలో కీలకమైన గోదావరి జిల్లాలలో కాపులకు ప్రాధాన్యత ఇస్తూనే బీసీలకు కూడా పెద్ద పీట వేయడం గమనార్హం.
ఇలా ప్రతీ జిల్లాలో నియమించిన కార్యవర్గాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇతర నాయకులు అంతా కూడా రేపటి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసే సైనికులుగానే చూస్తున్నారు. మరో విషయం ఏంటి అంటే రెండు సార్లు ఎన్నికల్లో టికెట్లు పొంది పదవులు అందుకున్న వారికే మూడవసారి బీయారెస్ టికెట్ ఇచ్చింది.
యాంటీ ఇంకెంబెన్సీ ఉందని తెలిసినా దాన్ని వ్యూహాలతో అధిగమించవచ్చు అన్న ఆలోచనతోనే కేసీయార్ ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. దీని వల్ల విపక్షాల వైపు సిట్టింగులు పెద్ద ఎత్తున వెళ్ళకుండా కళ్ళెం వేశారు. ఆశావహుల కంటే అప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఉనన్ సిట్టింగులకే పరపతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని అలా కట్టడి చేయగలిగారు.
ఇపుడు వైసీపీ కూడా అదే ఫార్ములాను పరిశీలిస్తోంది. ఏపీలో కూడా సిట్టింగులకే ఆత్యధిక శాతం టికెట్లు ఇవ్వడం వల్ల విపక్షాలకు చెక్ చెప్పినట్లు అవుతుందని, ఆశావహులకు పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం ద్వారా జంపింగ్స్ అన్నవి అత్యధిక శాతం లేకుండా చూసుకోవచ్చు అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది అంటున్నారు.