బాబు మీద జగన్ బ్రహాస్త్రం అదేనా...?
ఇది నిజంగా చిన్న ప్రశ్నగా ఉన్నా జవాబు మాత్రం చెప్పడం కష్టం. బాబు పద్నాలుగేళ్ల లో తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీలోనే గడచింది
By: Tupaki Desk | 30 Aug 2023 3:45 AM GMTచంద్రబాబు మీద జగన్ ఒక బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసి ఉంచారు. దానికి బాబు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. జనంలో ఇపుడు తిరిగినపుడు కాదు ఎన్నికల వేళ పొలిటికల్ గా హీటెక్కిన వేళ జగన్ ఆ బ్రహ్మాస్త్రానికి మరింత పదును పెడతారు అని అంటున్నారు. అదేంటే పద్నాలుగేళ్ల పాటు సీఎం గా ఉన్న బాబు విభజన ఏపీకి ఏమి చేశారు అన్నది.
ఇది నిజంగా చిన్న ప్రశ్నగా ఉన్నా జవాబు మాత్రం చెప్పడం కష్టం. బాబు పద్నాలుగేళ్ల లో తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీలోనే గడచింది. అయితే బాబు అప్పట్లో ఏమీ చేయలేదని కాదు, చాలానే చేశారు. కానీ ఆయన చేసిన అభివృద్ధి అంతా హైదరాబాద్ కే పరిమితం అయింది. ఇపుడు హైదరాబాద్ తెలంగాణాలో ఉంది.
అక్కడ టీడీపీ రాజకీయ జాతకం ఏమంత బాగా లేదు టీడీపీకి ఉనికి పుట్టిన గడ్డ మీద ఏమీ లేదు, ఇక టీడీపీకి మూలాలు బాగా ఉన్న ఆంధ్రాకు ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా పెద్దగా చేసింది లేదు అని అంటున్నారు. నాడే ఏపీకి ఎంతో చేసి ఉంటే విభజన తరువాత ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కి అనుమతుల నుంచి అన్నీ వైఎస్సార్ ఉమ్మడి ఏపీ సీఎం గా తెచ్చారని వైసీపీ అంటోంది. దాంతో దాన్ని ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఇక అభివృద్ధి పరంగా ఇమేజ్ ఉన్న చంద్రబాబు ఏపీలో విశాఖను కూడా ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదని వైసీపీ అంటోంది. విశాఖకు ఐటీ హిల్స్ వచ్చినా, లేక సెజ్ లు వచ్చినా అవన్నీ వైఎసార్ గొప్పతనం అని చెబుతోంది. అలాగే ఫ్లై ఓవర్లకు శ్రీకారం చుట్టింది వైఎస్సార్ అని అలాగే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ప్రతిపాదించింది విశాఖను జీవీఎంసీ గా చేసింది కూడా ఆయనేనని వైసీపీ చెబుతోంది.
ఇక సంక్షేమం అంటే ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ చేస్తే గత నాలుగున్నరేళ్లు వైసీపీ చేసి చూపిస్తోందని, ఇపుడు అభివృద్ధి పరంగా కూడా విశాఖ సహా అన్ని చోట్లా తమ ముద్రను చాటుకుంటున్నామని అంటోంది. మరి చంద్రబాబు పద్నాలుగేళ్ల పాటు పాలించి ఏమి చేశారు అని జగన్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు.
మీ పేరుతో ఉన్న ఒక్క పధకం చెప్పండి అని గద్దిస్తున్నారు మేము చేసిన పధకాలను తిరిగి ఇస్తామని చెప్పడం కాదు మీరు ఏమిటి క్రియేట్ చేశారో చెప్పండి అని వైసీపీ మంత్రులు కూడా అడుగుతున్నారు. ఇపుడు చూస్తే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు అభివృద్ధి చేయాలనుకుని భారీ కాన్వాస్ పెట్టుకుని కూర్చున్నారు. దాంతో ఆయన ఏమీ చేయలేకపోయారు.
రాజధాని విషయంలో చంద్రబాబు తప్పులు చేశారని సొంత పార్టీ వారితో పాటు బీజేపీ చాలా సార్లు విమర్శించింది. లేటెస్ట్ గా సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు గుంటూరు టూర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో శాశ్వత భవనాలు బాబు నిర్మించి ఉంటే ఇపుడు మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చేది కాదు కదా అని తప్పు పట్టింది.
మొత్తానికి డెవలప్మెంట్ కి కేరాఫ్ అని బాబు ఎంత చెప్పినా అదంతా హైదరాబాద్ కే పరిమితం అయింది. ఏపీలో అయితే చేస్తాను అవకాశం ఇవ్వండి అనే బాబు అడగాల్సి ఉంటుంది. సంక్షేమం విషయం తీసుకుంటే వైసీపీ కంటే మూడు రెట్లు ఎక్కువగా మేము పధకాలు ఇస్తామని కొత్త హామీలు ఇవ్వడం తప్ప చేసేది లేదని అంటున్నారు.
అందుకే సంక్షేమం విషయంలో తాము సక్సెస్ ఫుల్ గా ఉన్నామన్న నిబ్బరంతోనే చంద్రబాబు ఏపీకి ఏమి చేశారు, ఇన్నేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయని వారు మళ్లీ చాన్స్ ఎలా అడుగుతారు అంటూ నిండా గాలి తీసేస్తోంది వైసీపీ. మరి దీనికి బాబు వద్ద కానీ టీడీపీ వద్ద కానీ జవాబు ఉందా అన్నదే చర్చ. అది కూడా జనాలు మెచ్చేలా లేకపోతే మాత్రం టీడీపీకి ఇబ్బందే అవుతుంది అని అంటున్నారు.