తాడేపల్లికి వచ్చేసిన సీఎం జగన్
వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు
By: Tupaki Desk | 12 Sep 2023 4:17 AM GMTవ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు. సతీసమేతంగా విదేశీ పర్యటన వెళ్లిన వారు.. ఈ రోజు తెల్లవారుజామున (మంగళవారం) ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఏపీ మంత్రులతో సహా పలువురు ఉన్నతాధికారులు ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఈ నెల రెండున సీఎం జగన్ విదేశీ పర్యటన కోసం లండన్ వెళ్లటం తెలిసిందే.
ఈ పర్యటన ముగిసే నాటికి ఏపీ విపక్ష నేత చంద్రబాబు అరెస్టు కావటం.. హైడ్రామా నడుమ ఆయనకు రిమాండ్ విధిస్తూ సీఐడీ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. విపక్ష నేత అరెస్టు వేళలో విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి.. ఆయన రిమాండ్ కు వెళ్లిన రోజు తర్వాత గన్నవరం చేరుకున్నారు. సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు దారి వెంట ఉండటం గమనార్హం.
కారులో నుంచే రెండు చేతులు జోడించి.. వారికి నమస్కారం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ కు వెల్ కం చెప్పేందుకు దారి వెంట పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు రావటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ పెద్దగా నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు మీద జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.