అవయువదానం వేళ సీఎం జగన్ లైన్లోకి.. హెలికాఫ్టర్ ఏర్పాటు
పుట్టిన రోజు వేడుక జరుపుకున్న నాలుగు రోజులకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుర్రాడి.. అవయువాలు మరికొందరి ప్రాణాల్ని నిలిపిన ఉదంతం గుంటూరులో చోటు చేసుకుంది
By: Tupaki Desk | 27 Sep 2023 5:34 AM GMTఒక విషాదం మరికొందరి జీవితాల్ని ముందుకు వెళ్లేలా చేయటం అవయువదానం వల్లే జరుగుతుంది. ప్రాణం పోతే మరికొందరి ప్రాణాల్ని కాపాడేలా చేసే అవయువదానంపై అవగాహన పెరగటమే కాదు.. అర్థాంతరంగా తమను విడిపోయిన వారి అవయువాలు మరికొందరిలో ఉన్నాయన్న ఊరట కలిగిస్తున్న విషయం తెలిసిందే. పుట్టిన రోజు వేడుక జరుపుకున్న నాలుగు రోజులకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుర్రాడి.. అవయువాలు మరికొందరి ప్రాణాల్ని నిలిపిన ఉదంతం గుంటూరులో చోటు చేసుకుంది. అవయువ దానం కోసం గ్రీన్ చానల్ ఏర్పాటుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపటం.. ఏకంగా హెలికాఫ్టర్ ను అందుబాటులోకి వచ్చేలా చేయటాన్ని పలువురు అభినందిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన 19 ఏళ్ల కట్టా క్రిష్ణ ఈ నెల 23న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పుట్టిన రోజు వేడుక జరిగిన నాలుగు రోజులకే జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు క్రిష్ణను బ్రెయిన్ డెడ్ గా నిర్దారించారు. అతడి అవయువాల్ని మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతాయన్న మాటకు అతడి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ.. తన కొడుకు మరికొందరి జీవితాల్లో వెలుగు నింపుతారన్న మాటకు వారు అవయువ దానానికి ఒప్పుకున్నారు.
దీంతో గుంటూరు నుంచి గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి.. క్రిష్ణ గుండె.. లివర్.. రెండు కిడ్నీలు.. కళ్లను దానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. క్రిష్ణ అవయువాల్లో గుండెను వేరు చేసి తిరుపతికి పంపారు. లివర్ ను విశాఖపట్నం.. కిడ్నీలను గుంటూరు, విజయవాడలోని ఆసుపత్రులతో పాటు కళ్లను గుంటూరు సుదర్శన్ కంటి ఆసుపత్రికి తరలించారు. చదువుకొని పది మందికి సాయం చేయాలన్నది తమ కొడుకు కల అని.. ఇలా అయినా వాడి ఆశయం నెరవేరినట్లుగా అనుకుంటామని తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
ఆటోలో ఉల్లిపాయలు అమ్ముకొని జీవించే క్రిష్ణ తల్లిదండ్రులు.. ప్రమాద వేళ.. ఆటోను అమ్మేసి మరీ చికిత్సకు డబ్బుల్ని ఏర్పాటు చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. క్రిష్ణ గుండెను తిరుపతికి తరలించేందుకు సమయం పరిమితంగా ఉండటం.. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. హెలికాఫ్టర్ ను అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అవయువాల్ని తరలించటానికి సమయం అడ్డంకిగా మారకూడదన్న ఉద్దేశంతో.. ప్రత్యేక చొరవను చూపి హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేయటంతో.. గంట వ్యవధిలో క్రిష్ణ గుండె తిరుపతికి చేరింది. అక్కడ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి పర్యవేక్షణలో కర్నూలు జిల్లాకు చెందిన 33 ఏళ్ల యువకుడికి గుండెను అమర్చి ప్రాణదానం చేశారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన క్రిష్ణ మన చుట్టూ లేకపోవచ్చు కానీ అతడి అవయువాలు పలువురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయని మాత్రం చెప్పక తప్పదు.