Begin typing your search above and press return to search.

బలమైన ఎన్నికల ఆయుధం రెడీ చేసిన జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికల కోసం బలమైన ఆయుధం తయారు చేస్తున్నారు. ఏపీలో కీలకమైన వర్గంగా రైతాంగం ఉంది

By:  Tupaki Desk   |   29 Nov 2023 3:30 AM GMT
బలమైన ఎన్నికల ఆయుధం రెడీ చేసిన జగన్
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికల కోసం బలమైన ఆయుధం తయారు చేస్తున్నారు. ఏపీలో కీలకమైన వర్గంగా రైతాంగం ఉంది. రైతులకు కావాల్సిన ప్రయోజనాలు నెరవేర్చే పార్టీకే వారు ఓటు వేస్తారు. దేశంలో రైతుల పాత్ర ఎపుడూ ప్రాధాన్యం గానే ఉంటుంది.

ఎక్కడ ఎన్నికలు జరిగినా రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా ఉంటాయి. ఈ నేపధ్యంలో రైతాంగం ఇష్యూని టేకప్ చేసిన పార్టీకే విజయం కూడా వరిస్తుంది. దీంతో అధికార వైసీపీ ఇపుడు రైతాంగం వ్యవసాయ రంగం సమస్యల మీదనే ఫోకస్ చేస్తోంది.

జగన్ రైతాంగం కోసం భారీ కార్యక్రమాన్నే సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న రైతన్నలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని జగన్ చెబుతున్నారు. వైసీపీ గడచిన నాలుగున్నరేళ్ళుగా పగటి పూట రోజుకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇదే తీరున మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు

అదే విధంగా 1700 కోట్ల రూపాయలతో విద్యుత్ ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇచ్చేందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్‌ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ఇంధన రంగానికి సంబంధించి 6600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు పనులకు శ్రీకారం చుట్టిన నేపధ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అన్నది నిరంతరం అందుతుందని, అది కూడా నాణ్యతతో కూడినది అని జగన్ హామీ ఇస్తున్నారు.

అంటే రానున్న ఎన్నికల్లో మరోసారి రైతాంగం మద్దతు తీసుకునేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది అన్న మాట. ఉచిత విద్యుత్ రైతులకు అన్నది వైఎస్సార్ మానస పుత్రిక లాంటి పధకం. దాని మీద అప్పట్లో టీడీపీ వ్యతిరేకించినా ఆ తరువాత అదే బాటన ఆ పార్టీ కూడా నడచింది. తెలంగాణాలో అది అమలు అవుతోంది.

ఇపుడు చూస్తే వైసీపీ ఆ పధకాన్ని పూర్తిగా తమ సొంతం చేసుకునే వ్యూహంలో భాగంగానే ఈ రకంగా ప్లాన్ తో వస్తోంది అంటున్నారు. ఏకంగా పాతికేళ్ల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అన్నది వైసీపీ నినాదం అయితే అది ఎన్నికల్లో ఆ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని లెక్క వేస్తున్నారు. అదే విధంగా రైతుల కోసం ముందు ముందు మరిన్ని పధకాలు కూడా ప్రకటించే యోచనలో వైసీపీ ఉందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతంలోనే అత్యధిక ఓటు బ్యాంక్ వైసీపీకి ఉంది.

దాంతో పాటు రైతాంగం మద్దతుని శాశ్వతం చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది అని అంటున్నారు.