జగన్ విశాఖ మకాంకి కేంద్రమే అడ్డంకి...?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విశాఖ రావాలని అక్కడ కాపురం పెట్టాలని ఎంతగా కోరిక ఉందో అది అంతలా ఆలస్యం అవుతోంది
By: Tupaki Desk | 29 Nov 2023 11:30 PM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విశాఖ రావాలని అక్కడ కాపురం పెట్టాలని ఎంతగా కోరిక ఉందో అది అంతలా ఆలస్యం అవుతోంది. మూడేళ్ళుగా జగన్ విశాఖ అని అంటున్నారు. ఇక ఈ ఏడాది మొదటి నుంచి త్వరలో విశాఖ అని ప్రకటనలు వైసీపీ విడుదల చేస్తోంది. ప్రచారంలో ఉన్నదైతే డిసెంబర్ మొదటి వారంలో జగన్ విశాఖకు వస్తారని.
అయితే ఇపుడు జగన్ రాకకు అతి పెద్ద అడ్డంకి ఎదురుకాబోతోంది అని అంటున్నారు. అది కూడా కేంద్రం నుంచే అని తెలుస్తోంది. అదెలాగ అంటే రుషికొండ మీద ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలు పర్యావరణ అనుమతులు దాటి ఉన్నాయని దాఖలైన పిటిషన్ మీద హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు కేంద్ర అధికార బృందం డిసెంబర్ మొదటి వారంలో విశాఖకు వెళ్లి రుషికొండ మీద ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని కోర్టుకు నివేదించినట్లుగా తెలిసింది.
అంటే జగన్ ఏ ముహూర్తం అయితే అనుకున్నట్లుగా ప్రచారం సాగుతోందో ఆ డిసెంబర్ మొదటి వారంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం విశాఖకు వచ్చి రుషికొండ భవనాల నిర్మాణాల తీరుని గమనిస్తుందని, అక్రమంగా ఏమైనా నిర్మించారా అన్నది పరిశీలించి కోర్టుకు నివేదిక ఇస్తుంది అని అంటున్నారు.
దాంతో జగన్ విశాఖ మకాం డిసెంబర్ మొదటి వారానికి ఈ విధంగా బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర అధికారుల బృందం ఈ భవనాలను పరిశీలించే సమయంలో ముఖ్యమంత్రి అక్కడ మకాం ఉండడం సరైనది కాదు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవచ్చు అని అంటున్నారు.
ఇక ఈ కేసుని హైకోర్టు డిసెంబర్ 27కి వాయిదా వేసింది. మరి కేంద్ర బృందం నివేదిక ఏంటి ఇస్తుంది అన్నది తెలియదు, అది సీల్డ్ కవర్ లో ఉంటుంది. ఒక వేళ పర్యావరణ అనుమతులను దాటి నిర్మించారు అని అంటే మాత్రం అది ఇబ్బందికరంగానే ఉంటుంది. దాని మీద హైకోర్టులో ఏమి జరుగుతుందో కూడా తెలియదు. అయితే గతంలో ఒకసారి కేంద్ర బృందం పరిశీలన జరిపి ఇచ్చిన అనుమతుల కంటే కొంత మేర అక్రమంగా నిర్మించారు అని నివేదించింది.
ఇపుడు భవనాలు పూర్తి అయ్యాయి కాబట్టి ఎంత మేరకు ఆ అనుమతుల ఉల్లంఘన జరిగింది అని నివేదిక ఇవ్వవచ్చు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే జగన్ డిసేంబర్ లో విశాఖకు షిఫ్ట్ అయ్యేది ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు అంటున్నారు. ఎందుకంటే జనవరి 13 దాకానే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత మళ్లీ ఫిబ్రవరి 12 తరువాత కానీ లేవు అని అంటున్నారు. అప్పటికి ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది.
అదే విధంగా రాజకీయం కూడా కాక మీద ఉంటుంది. అపుడు మారాలనుకున్నా దాని ఇంపాక్ట్ కూడా ఏమీ ఉండదని అంటున్నారు. సో జగన్ ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నెలలోనే మారాలి అని అంటున్నారు. అయితే దీని మీద వైసీపీ వర్గాలు చేస్తున్న ప్రచారం చూస్తే కేంద్ర అధికారుల బృందం వెళ్ళిన తరువాత జగన్ విశాఖకు మకాం మారుస్తారు అని. అంటే రుషికొండ మీద కట్టిన భవానాలలో ఆయన గృహ ప్రవేశం చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమిటి జరుగుతుందో.
ఏది ఏమైనా ఈసారి జగన్ ఆశలకు కేంద్రమే గండి కొడుతోందా అన్న చర్చ అయితే వస్తోంది. అదే విధంగా అమరావతి రాజధాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో గత సెప్టెంబర్ లో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. దాని మీద సుప్రీం కోర్టులో విచారణ కూడా డిసెంబర్ లో ప్రారంభం కానుంది. మరి ఇవన్నీ ఆలోచించిన మీదటనే విశాఖ షిఫ్టింగ్ మీద వైసీపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.