Begin typing your search above and press return to search.

ఢిల్లీ టూ అమరావతి... అభ్యర్థుల జాబితాలో జగన్ తాజా మార్పులివే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Dec 2023 6:48 AM GMT
ఢిల్లీ టూ అమరావతి... అభ్యర్థుల జాబితాలో జగన్ తాజా మార్పులివే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో అనూహ్య మార్పులు చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రి, మాజీ మంత్రి, సీనియర్, జూనియర్ అనే తేడాలకు జగన్ తావివ్వడం లేదై తెలుస్తుంది. ఇదే సమయంలో పలువురు ఎంపీలకు రెస్ట్ ఇస్తున్నారని.. మరికొంతమందిని అసెంబ్లీకి పంపుతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జగన్ చేస్తున్న ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పుల అంశం చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే అధికారికంగా సుమారు 11 మంది ఇన్ ఛార్జ్ లను మార్చిన జగన్.. త్వరలో మరిన్ని కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీకి నిలబెడుతున్నారని సమాచారం.

అవును... ఇప్పటికే కొంతమంది మంత్రులను ఎంపీలుగా ఖరారూ చేశారంటూ కథనాలొస్తున్న వేళ... పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో సుమారు 11 మంది ఎంపీల మార్పులు కన్ ఫాం అని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని ముగ్గురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను రాజమండ్రి అర్బన్ నుంచి.. అమలాపురం ఎంపీని పి.గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సంబంధించి గతంలో పలు ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే!

ఇక రాజమండ్రి అర్బన్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓదిపోయిన రౌతు సూర్యప్రకాశ్ రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్మెంటు అథారిటీ (రుడా) ఛైర్మన్‌ గా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. ఇక పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఈ దఫా ఫుల్ రెస్ట్ అని తెలుస్తుంది!

ఇక మిగిలిన ఎంపీలలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఈసారి పీలేరు నుంచి అసెంబ్లీ బరిలో నిలిపే అంశంపై కసరత్తు జరుగుతోందని తెలుస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ సారి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ పైన స్పష్టత రావాల్సి ఉండగా... అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా బరిలోకి దిగటం దాదాపు ఖాయమైందని తెలుస్తుంది.

ఇదే సమయంలో... హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో జగన్ నిర్ణయం ఏంటనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ... వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్దిగా బళ్లారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా... విజయవాడ, ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తోందని తెలుస్తుంది.