రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ కు జగన్.. అసలు ఏం జరుగుతోంది?
ప్రస్తుతం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల, వారి తల్లి వైఎస్ విజయమ్మ మాత్రమే ఉంటున్నారు
By: Tupaki Desk | 4 Jan 2024 8:43 AM GMTఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో గాయపడి ఆపరేషన్ చేయించకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న జగన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉంటున్న కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శించిన వైఎస్ జగన్ బంజారాహిల్స్ లోటస్ పాండ్ లో ఉన్న తన నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల, వారి తల్లి వైఎస్ విజయమ్మ మాత్రమే ఉంటున్నారు. వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నాక గత రెండేళ్లలో లోటస్ పాండ్ కు రాలేదని చెబుతున్నారు. లోటస్ పాండ్ కు జగన్ వచ్చి రెండేళ్లు దాటిపోయిందని అంటున్నారు.
ఓవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి భర్తతో సహా ఢిల్లీలో ఉండగా.. లోటస్ పాండ్ లో షర్మిల లేని సమయంలో వైఎస్ జగన్ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్ కు ఇష్టం లేదని టాక్ నడుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరడం, ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇస్తారని వార్తలు వస్తుండటంపై వైసీపీ వర్గాలు ఆందోళనగా ఉన్నాయని అంటున్నారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే తాను కూడా కాంగ్రెస్ లో చేరతానని ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈయన బాటలోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా నడిచే అవకాశం ఉంది. అలాగే వైసీపీలో సీట్లు దక్కించుకోలేని వారికి షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ బలపడితే నష్టపోయేది వైసీపీయేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లు మారిన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ వెంట నడుస్తున్నారు. ఇప్పుడు షర్మిల, తదితర నేతల చేరికలతో కాంగ్రెస్ బలపడితే ముస్లిం, ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లలో కొంతవరకు ఆ పార్టీతో నడవడం ఖాయమంటున్నారు. ఇదే జరిగితే వైసీపీకి నష్టం జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే ఆమె పార్టీతో తమకెలాంటి సంబంధం లేదని, ఆమె పార్టీ పెట్టడం తమకు ఇష్టం లేదని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పేశారు. అలాంటిది తమను దెబ్బతీసేలా ఏపీలోకే షర్మిల ప్రవేశాన్ని వైసీపీ తట్టుకోలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ లోటస్ పాండ్ కు వెళ్లారని అంటున్నారు. తన తల్లి విజయమ్మ వద్దే షర్మిల వ్యవహారాన్ని ప్రస్తావిస్తారని టాక్ నడుస్తోంది. ఇలా చేస్తే అంతిమంగా తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన పార్టీయే నష్టపోయే అవకాశం ఉందని ఆయన వివరించవచ్చని అంటున్నారు.
మరోవైపు బంజారాహిల్స్ లో కేసీఆర్ ను పరామర్శించడానికి వచ్చిన వైఎస్ జగన్ అక్కడే లోటస్ పాండ్ లో ఉంటున్న తన తల్లి విజయమ్మను పలకరించడానికి వచ్చారని.. అంతే తప్ప ఇందులో ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం లేదని అంటున్నారు. కేవలం తన తల్లిని చూసిపోవడానికే వచ్చారని చెబుతున్నారు.