ముగ్గురు నానిలలో జగన్ కు ఎవరు ఎక్కువ ఇష్టం?
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ర్యాపిడ్ ఫైర్ పేరుతో ఐదు ఆసక్తికర ప్రశ్నల్ని ఆయనకు సంధించారు
By: Tupaki Desk | 12 Feb 2024 6:30 AM GMTఒక టీవీ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్నినాని హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఐదుగురిని ఒక వేదిక మీద ఉంచి.. ఒక రాజకీయ నేతను ప్రశ్నల పరంపరను సంధించే ప్రోగ్రాం సక్సెస్ కావటంతో ఏపీలోనూ ఈ ప్రోగ్రాంను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పేర్ని నాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ర్యాపిడ్ ఫైర్ పేరుతో ఐదు ఆసక్తికర ప్రశ్నల్ని ఆయనకు సంధించారు. తాము అడిగిన ప్రశ్నలకు అవును .. కాదు.. లేదంటే సదరు చానల్ ఇచ్చిన ఆప్షన్లలో ఏదో ఒక ఆన్సర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ రౌండ్ కు సంబంధించి పేర్ని నాని ఎదుర్కొన్న మొదటి ప్రశ్న విషయానికి వస్తే.. ''రాజకీయంగా పేర్ని నాని.. రిటైరా? రిటైర్డ్ హార్ట్?'' అని ప్రశ్నించగా.. హర్ట్ అనేది లేదని.. సంత్రప్తికరమైన రాజకీయ జీవితంగా పేర్కొన్నారు.
ఎవరూ చేయలేనన్ని మంచి పనుల్ని తన నియోజకవర్గంలోని తన ఊరికి చాలామంది ఎమ్మెల్యేలు చేయలేని ఎన్నో పనుల్ని తాను చేశానని.. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనను కన్ననేల రుణం తీర్చుకున్నట్లుగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. రెండో ప్రశ్నకు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ''ముగ్గురు నానిల్లో అధిష్టానానికి ఎవరు క్లోజ్?'' అని ప్రశ్నించి.. ఆప్షన్లు కింద ''ఆళ్ల నాని.. పేర్ని నాని.. కొడాలి నాని'' ఇవ్వగా.. మొదట ముగ్గురం క్లోజ్ అని బదులిచ్చారు. అలా కాదు.. ఒక్కరి పేరే చెప్పాలని కోరగా.. ఆళ్ల నాని అంటూ బదులిచ్చారు. ఎందుకలా? అని అడగ్గా.. ఆ ప్రశ్నను తనను కాదని.. అడిగితే ఆళ్ల నానిని.. లేదంటే సీఎం జగన్ ను అడగాలన్నారు.
ఎవరు దగ్గర అంటే తాను చెప్పానని.. ఎందుకిష్టం అంటే తాను ఎలా సమాధానం చెబుతానని.. వాళ్లనే అడగాలన్నారు. మీరెందుకు కాదు? అని అడగ్గా.. తనకు తెలుసని చెప్పారు. తమ ముగ్గురిలో ఆళ్ల నానినే పెద్ద పీటగా పేర్కొన్నారు. సినిమా రంగంలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని అడగ్గా.. చిరంజీవి తన ఫేవరెట్ హీరోగా పేర్కొన్నారు. చిరంజీవి పిచ్చితోనే వచ్చామని.. బోర్డులకు దండలేయటం.. మొదటి షో చూడటం చేసేవాళ్లమన్నారు. ఇప్పుడైతే ఏ సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తానన్న ఆయన.. ఇప్పటికి చిరంజీవి అంటే ఇష్టమని.. పాత ఇష్టం పోదు కదా? అని వ్యాఖ్యానించారు.
వీరిలో ఎవరిని ప్రత్యర్థిగా భావిస్తున్నారు? అన్న ప్రశ్నకు ఆప్షన్లుగా బాలశౌరి.. కొల్లు రవీంద్ర పేర్లు చెప్పగా.. కొల్లు రవీంద్ర పేరు చెప్పారు పేర్ని నాని. ఎన్నికల్లో మనతో రోజువారీ తలపడే వాళ్లు మనకు ప్రత్యర్థులు అవుతారని వ్యాఖ్యానించారు. చివరగా.. పేర్ని నాని భవిష్యత్తు.. తీర్థయాత్రలా? వైసీపీ మౌత్ పీసా? అని ప్రశ్నించగా.. ఆసక్తికర రీతిలో సమాధానం ఇచ్చారు. ''ప్రధానంగా కుటుంబ జీవితం. జగన్ కోరుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్'' అని పేర్కొన్నారు.